కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీలోని ఉమెన్స్ హాస్టల్‌లో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పింది. మూడురోజుల క్రితం హాస్టల్‌లో బీ ఫార్మసీ సెకండియర్ విద్యార్థినులు బీఫార్మసీ ఫస్టియర్ విద్యార్థినులను ర్యాగింగ్ చేసినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం బీఫార్మసీలో చేరిన విద్యార్థినుల్లో కొందరు ఉమెన్స్‌హాస్టల్‌లో ఉంటున్నారు.
వారిని సీనియర్లు తమ గదులకు పిలిపించుకుని పరిచయాల పేరిట రాత్రివేళ ర్యాగింగ్‌కు పాల్పడడం, వారి వికృత చేష్టలతో మాటలతో ఆయా విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేయడం బాధితుల తల్లిదండ్రులకు తెలిసింది. వారు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్పందించిన కేయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి సీనియర్, జూనియర్ విద్యార్థినులను పిలిపించి మూడు రోజుల క్రితం మాట్లాడారు.
ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కళాశాల, హాస్టల్ నుంచి కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆరుగురు సెకండియర్ విద్యార్థినులు మళ్లీ తాము జూనియర్లను ర్యాగింగ్‌కు పాల్పడబోమని ప్రిన్సిపాల్‌కు అండర్ టేకింగ్ ఇచ్చినట్లు తెలిసింది. కొన్నేళ్ల క్రితం కూడా ఉమెన్స్ హాస్టల్‌లో బాటనీ విభాగానికి చెందిన పలువురు సీనియర్ విద్యార్థినులు జూనియర్లను ర్యాగింగ్ చేయగా వారిపై పోలీస్ కేసు నమోదైంది.
ఆ తర్వాత వారిని ఉమెన్స్ హాస్టల్ నుంచి వారిని సస్పెండ్ చేశారు. మళ్లీ ఇప్పుడు ఫార్మసీ సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. క్యాంపస్‌లోని యాంటీర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాత్రివేళల్లో హాస్టళ్లలో ఈ కమిటీలు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కాగా ఈ విద్యాసంవత్సరంలో ఫార్మసీ విద్యార్థులకు ర్యాగింగ్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి యోచిస్తున్నారు.
కేయూ ఉమెన్స్ హాస్టల్‌లో ర్యాగింగ్ !
Published Sun, Oct 27 2013 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement