- 300 పడకల భవనంలో మెటర్నిటీ సేవలు ప్రారంభం
- మెటర్నిటీ అధికారులకు కార్మిక సంఘాల మద్దతు
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో ప్రారంభించాలనుకుంటున్న శ్రీపద్మావతీ మహిళా వైద్య కళాశాల నిర్వహణకు మెటర్నిటీ అధికారులు ఝలక్ ఇచ్చారు. మెడికల్ కళాశాలకు కేటాయించాలనుకున్న 300 పడకల ఆస్పత్రి భవనంలోకి శుక్రవారం మెటర్నిటీ అధికారులు, వైద్యులు అనధికారికంగా గృహ ప్రవేశం చేసి వైద్య సేవలను ప్రారంభించారు.
వైద్య కళాశాల ఏర్పాటుకు సంబంధించి మౌలిక వసతులను పరిశీలించేందుకు స్వయాన మెడికల్ కౌన్సిల్(ఎంసీఐ) బృందం తిరుపతిలో పర్యటిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం అటు స్విమ్స్ వర్గాల్లో, ఇటు ఎంసీఐ బృందంలో చర్చనీయాంశమైంది. 15 రోజుల క్రితం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా జారీ అయిన జీవో మేరకు మెటర్నిటీ ఆస్పత్రి విస్తరణలో భాగంగా గర్భిణుల కోసం నిర్మించిన 300 పడకల భవనాన్ని స్విమ్స్ మహిళా వైద్య కళాశాలకు కేటాయించాల్సి ఉంది.
ఆ జీవో జారీ అయిన మరుసటి రోజే భవనాన్ని స్విమ్స్‌కు కేటాయించకూడదంటూ ఎస్వీ మెడికల్ కాలేజీ అభివృద్ధి కమిటీ, మెటర్నిటీ అధికారుల సంఘం నుంచి ప్రభుత్వానికి విజ్ఞాపనలు వెళ్లాయి. వారి విజ్ఞాపనలకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానమూ రాలేదు. అయినప్పటికీ స్విమ్స్ వర్గాలు, వైద్యశాఖ ఉన్నతాధికారులు మాత్రం వైద్య కళాశాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు.
ఆ దిశగా ఎంసీఐ బృందాన్ని తక్షణం తిరుపతికి రప్పించి స్విమ్స్ పరిధిలోని కొన్ని కాలేజీ భవనాలతోపాటు 300 పడకల భవనాన్ని మెడికల్ కళాశాలకు ఓకే చేయించుకోవాలనుకున్నారు. మూడు రోజులుగా పూర్తి విషయాలను పరిశీలిస్తూ వచ్చిన మెటర్నిటీ అధికారులు, వైద్యులు తమకు చెందిన భవనాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉపక్రమించారు. శుక్రవారం ఉదయం ఆ భవనంలో ఓపీ, మందుల పంపిణీ, వార్డుల్లో గర్భిణుల అడ్మిట్ తదితర వైద్య సేవలను చేపట్టారు.
రాజకీయ ఒత్తిడి పెంచిన మెటర్నిటీ అధికారి?
మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన 300 పడకల భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్విమ్స్ వైద్య కళాశాలకు కేటాయించకుండా చేసేందుకు మెటర్నిటీకి చెందిన ఓ అధికారి రాజకీయ ఒత్తిడులు పెంచుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో రాష్ర్టపతి పాలన అమలులో ఉండగా స్విమ్స్‌కు 300 పడకల భవనాన్ని కేటాయిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
మరో వారం రోజుల్లో అధికారంలోకి రానున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతతో మెటర్నిటీ అధికారి కాబోయే సీఎం స్థాయికి ఒత్తిడి పెంచారు. స్విమ్స్ అధికారులు, పాలకవర్గం కూడా ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ ప్రారంభించారు. శుక్రవారం మెటర్నిటీ అధికారులు, వైద్యులు చేసిన కార్యక్రమాలకు సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు చిన్నం పెంచలయ్య, మురళి సంపూర్ణ మద్దతు పలికారు.