హైదరాబాద్‌ను యూటీగా ఒప్పుకోం: అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి అంగీకరించే ప్రసక్తే లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ఎంఐఎం నేతలను ఆహ్వానించేందుకు గురువారం దారుస్సలాంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయానికి ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వచ్చారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీని కలిసి బహిరంగసభకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ, సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఏపీఎన్జీఓలు చేపట్టబోయే సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. బహిరంగ సభకు హాజరయ్యేదీ లేనిదీ తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో కలిసి చర్చించి తెలియజేస్తామని చెప్పారు.