
హైదరాబాద్‌పై తగ్గేదిలేదు: హరీశ్‌రావు
జగిత్యాల, న్యూస్‌లైన్: హైదరాబాద్ విషయంలో తెలంగాణ ప్రజలు వెనుకడుగు వేసే పరిస్థితే లేదని, 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రమే లక్ష్యమని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో జగిత్యాలలో బుధవారం జరిగిన విద్యాసంస్థల రణభేరి సభలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం ద్రోహపూరితమని, అది కృత్రిమ ఉద్యమమని ఆరోపించారు. వారి ఉద్యమం వెనక కృష్ణా, గోదావరి నది జలాల్ని తరలించుకెళ్లాలనే ఆశతోపాటు, హైదరాబాద్‌లో ఉద్యోగాల యావ ఉందని ధ్వజమెత్తారు.
సీమాంధ్రలో చదువుకున్న విద్యార్థులంతా ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వస్తారని చెప్పిన సీఎం కిరణ్.. మరి, తెలంగాణ విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారో మాత్రం చెప్పలేదని మండిపడ్డారు. పువ్వులను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణకే ప్రత్యేకమని, ఈ పండగ విలువ తెలియని సీఎం కిరణ్ ఉత్సవాల నిర్వహణకు నియోజకవర్గానికి రూ.50 లక్షలు చొప్పున ఇవ్వాలని కోరితే... గతేడాది జిల్లాకు రూ.లక్ష మాత్రమే ఇచ్చారని విమర్శించారు.