కేసీఆర్ వెంటే తెలంగాణ ద్రోహులున్నారని వ్యాఖ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీని అవకాశవాద రాజకీయ పార్టీగా ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని గతంలో ప్రకటించిన వైఎస్ జగన్ తన వైఖరి మార్చుకోవడం తెలంగాణ ప్రజలను మోసగించడమేనన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావడం వల్లనే జగన్ జైలునుంచి విడుదల అయ్యారని ఆరోపించారు. సీమాంధ్రలో తొలి సీఎం కావాలనుకుంటున్న జగన్‌ను అక్కడి బడుగు బలహీన వర్గాలు తిప్పికొట్టాలన్నారు.
గుంటూరులో నిర్వహించనున్న అంబేద్కర్‌వాదుల సభను అడ్డుకోవడానికి కుటిల యత్నాలు జరుగుతున్నాయని, అందుకే 5, 6 తేదీల్లో ప్రైవేట్ ట్రావెల్స్, పెట్రోల్ బంక్‌ల బంద్‌ను నిర్వహించాలని ఏపీఎన్జీవోల సంఘం పిలుపునిచ్చిందని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును వినిపించేందుకు సభను విజయవంతం చేస్తామని అన్నారు. సకలజనుల భేరిలో కేసీఆర్ ఆంధ్రవాళ్లందరు తెలంగాణ ద్రోహులని అన్నారని, నిజానికి తెలంగాణ ద్రోహులు ఆయన వెంటనే ఉన్నారని వ్యాఖ్యానించారు.