పని చేస్తా.. చేయిస్తా
సాక్షి, కర్నూలు: ‘‘అధికారులందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రథమ లక్ష్యం. పారదర్శకంగా పని చేస్తా.. అధికారులచేత అదేవిధంగా పని చేయిస్తా. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించను.’’ అని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తన ముక్కుసూటి తనం స్పష్టం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో సీమ ముఖద్వారమైన కర్నూలును పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న పలు కార్యక్రమాలు వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘జిల్లాలో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం పంచ్చజెండా ఊపింది.
ఓర్వకల్లు మండలంలోని ఓర్వకల్లు, గడివేముల, మిడుతూరు మండలాల పరిధిలో ఇప్పటికే 29,394 ఎకరాల భూమిని గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఐఐసీ ఎండీతో చర్చించాం. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామ సమీపంలో న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు వెయ్యి ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశాం. కార్యరూపం దాలిస్తే సుమారు 3వేల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం సోలార్, పవన్ విద్యుదుత్పత్తికి పెద్దపీట వేస్తోంది.
జిల్లాలో ఇందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. పాణ్యం మండలం పిన్నాపురం వద్ద రూ.7వేల కోట్లతో 5వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశాం. దీని ద్వారా 2వేల కుటుంబాలకు ఉపాధి లభించనుంది. ఆస్పరిలోనూ వెయ్యి మెగావాట్ల పవన(విండ్) విద్యుత్ ప్లాంట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నాం. హలహార్వి మండలం గూళ్యంలోని వేదవతి నదిపై జలాశయం నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. నిర్మాణం పూర్తయితే నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్య తీరుతుంది.’’
మెరుగైన వైద్య సేవలు
వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాం. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపుతున్నాం. డెంగీ రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాం. స్వచ్ఛంద సంస్థలు.. విద్యార్థి, యువ జన సంఘాల సహకారంతో డెంగీపై గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. వ్యాధి నిర్ధారణకు జిల్లాలో సేవా కేంద్రాలు ఏర్పాటు చేశాం. కర్నూలు సర్వజన అసుపత్రితో పాటు, విశ్వభారతి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నంద్యాల శాంతిరామ్ ఆసుపత్రిలో ఎలీషా పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
ఇనుము, ఇసుక మాఫీయా ఉక్కుపాదం
ఇసుక అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపుతా. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఇసుక విధానాన్ని త్వరలోనే అమలు చేస్తాం. జిల్లాలో నాగులదిన్నె, మంత్రాలయం, జి.సింగవరం, నిడ్జూరు, బసాపురం, మామిదాలపాడు, పంచలింగాలలో ఇసుక క్వారీలు ఉండగా.. నాగులదిన్నె, మంత్రాలయం మినహా మిగతా వాటిని పర్యావరణ అనుమతుల్లేవు. అన్ని అంశాలపై సమగ్ర నివేదిక వచ్చిన తర్వాతే మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌లు అప్పగిస్తాం. ఇనుప ఖనిజం అక్రమ రవాణాపైనా దృష్టి సారించాం. అక్రమార్కులను వదిలే ప్రసక్తే లేదు. మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు.
నిక్కచ్చిగానే ఉంటా
ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందనే విషయం అధికారులు గుర్తుంచుకోవాలి. అభివృద్ధి పనులకు ప్రభుత్వం మంజూరు చేసే నిధులను వ్యయం చేసే విషయంలో జాప్యం కూడదు. అలా చేస్తే పనులు నిలిచిపోవడంతో పాటు అంచనా వ్యయం పెరిగి కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రభుత్వ విభాగాల సమీక్షల్లో తాను అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదు. ఇప్పటికే అధికారుల్లో చాలా వరకు మార్పు వచ్చింది. అంతా బాగా పని చేస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు పేపర్‌పైనే ఉంటాయి.