రణస్థలం: ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అతడిని విద్యుత్ షాక్ రూపంలో మృత్యువు కాటేసింది. పెద్ద కుమార్తె పెళ్లి విషయంలో తలమునకలై ఉన్న అతడిని పరలోకాలకు పంపించింది. త్వరలో మూహూర్తాలు చూసుకొని మేనల్లుడితో పెళ్లి చేసేందుకు పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. అంతలోనే ఆ కుటుంబానికి విద్యుత్ షాకు రూపంలో విషాదం మిగిలింది. పైడిభీమవరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి పంచాయతీ బుర్రవానిపాలెం గ్రామానికి చెందిన రెయ్యి భద్రయ్య(41) మంగళవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
ఇతడు 20 సంవత్సరాల నుంచి పైడిభీమవరం పంచాయతీ వరిశాంలో అత్తవారి ఇంట్లో ఉంటూ స్థానిక ఫార్మా కంపెనీలో క్రేన్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. జాతీయ రహదారి ఆరులైన్ల విస్తరణలో భాగంగా పైడిభీమవరం పంచాయతీలో షాపులను సోమవారం తొలగించారు. తొలగించిన తన షాపును వేరే ప్రదేశంలో పెట్టించేందుకు ప్రైవేటు కాంట్రాక్టరును ఓ షాపు యజమాని ఆశ్రయించాడు. అరబిందో ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న ఈ ప్రైవేటు కాంట్రాక్టరు లేబరుతో షాపు తరలించేందుకు సన్నద్ధమయ్యాడు.
మంగళవారం ఉదయాన్ని కంపెనీలో పనికి అని బయలుదేరిన రెయ్యి భద్రయ్య కాంట్రాక్టర్ చెప్పిన విధంగా షాపు తొలగించేందుకు అంగీకరించాడు. షాపును ఓ వైన్ షాపు పక్కన పెట్టిన సమయంలో పైన హైవోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి భద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి భార్య భద్రమ్మ, ముగ్గురు ఆడపిల్లలు గౌరి(19), భవాని(10), రోహిణి(7) ఉన్నారు. ఈ ఘటనపై జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
వరిశాంలో విషాదం
Published Wed, Jul 26 2017 4:49 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement