కార్మికులకు మంచి రోజులు
- ఉద్యోగులు సుఖసంతోషాలతో జీవించాలి
- కార్మికులను చీడపురుగుల్లా చూసిన చంద్రబాబు
- వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్ ప్రసాద్
- యూనియన్‌లో చేరిన వందల మంది స్వర్ణకార, ఆటోవర్కర్లు
విజయవాడ, న్యూస్‌లైన్ : రానున్న రోజుల్లో కార్మికులు, ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయని, వారు సుఖ సంతోషాలతో జీవిస్తారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ అన్నారు. మరోవారం రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడి కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నగర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రి వద్ద మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి జనక్‌ప్రసాద్ తొలుత యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు శ్రమ దోపిడీ నుంచి విముక్తి కలిగిన రోజే మేడే అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కార్మికులను చంద్రబాబు చీడపురుగుల్లా చూశారని విమర్శించారు.
చంద్రబాబు 54 ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటు పరం చేయడంతో 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రోశయ్య, కిరణ్ సర్కార్లు రూ.32 వేల కోట్ల మేరకు విద్యుత్ బిల్లుల విధించడంతో అనేక కంపెనీలు మూతపడి వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో జగన్‌మోహన రెడ్డి ఏ ఒక్క కార్మికుడికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపడతారన్నారు.
అర్హులైన కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేసే అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారని జనక్‌ప్రసాద్ తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు సుఖసంతోషాలతో జీవించాలన్నదే జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని పేర్కొన్నారు. అనంతరం ఆయన సిద్ధార్థ వైద్య కళాశాల ఎదుట యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు.
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మనోరంజని, స్టేట్‌వైస్ ప్రెసిడెంట్ ఎ.ఎం.ఆర్.పాల్, నగరశాఖ అధ్యక్షుడు విశ్వనాథ రవి, జిల్లా కార్యదర్శి జ్యోతిరెడ్డి, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వాస్పత్రి శాఖ అధ్యక్ష కార్యదర్శులు డి.సత్యనారాయణ, నాళం మురళీకృష్ణ, బాపట్ల శ్రీను, విశ్వనాథపల్లి జ్యోతిరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.వి.సత్యనారాయణ, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణకార, ఆటో కార్మికుల చేరిక
మేడే సందర్భంగా ప్రభుత్వాస్పత్రి వద్ద జరిగిన వేడుకల్లో నగరంలోని స్వర్ణకారులు 150 మంది పొన్నాడ గంగాధర్, శివశంకర్ ఆధ్వర్యంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్‌లో చేరారు. ఆటోవర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎండి.రఫీ, ఎం.భర ద్వాజ్ తదితరులు 200 మంది కూడా చేరగా వారిని జనక్‌ప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు.