కడ‘గండ్లు’ పూడేదెప్పుడో
- అధ్వానంగా చెరువు కట్టలు, తూములు, సప్లైచానెళ్లు
- పట్టించుకోని అధికారులు
పలమనేరు, న్యూస్‌లైన్: చెరువుల మరమ్మతు కోసం ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. గతంలో తెగిన చెరువు కట్టలు, సప్లయ్ చానెళ్లు ఇంతవరకు మరమ్మతులకు నోచుకోలేదు. కొద్దిమేర వర్షాలు పడుతున్నా నీరు నిల్వ ఉండే పరిస్థితి లేక రైతులు లబోదిబోమంటున్నారు.
పలమనేరు నియోజకవర్గంలో 19 పెద్ద చెరువులు, 892 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటిలో కొన్ని రెండేళ్ల క్రితం కురిసిన వర్షాలకు తెగిపోయాయి. మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఈ దఫా వర్షాలు కురిసినా చుక్కనీరు నిల్వ ఉండే పరి స్థితి లేదు. గతంలో ఇందిరమ్మ పథకంలో 150 చెరువుల మరమ్మతు పనులు చేపట్టారు. పనులు నాసిరకంగా ఉన్నాయంటూ అర్ధాంతరంగా ఆపేయడంతో వాటి పరిస్థితి ఎటూ కాకుండా పోయింది.
వర్షాలు కురిసి నీరు చేరితే తెగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. చెరువులకు వరద నీటిని తీసుకొచ్చే సప్లయ్ చానెళ్లు చాలావరకు పూడిపోయాయి. మిగిలినవి ఆక్రమణకు గురయ్యాయి. తద్వారా ఎంత వర్షం కురిసినా చుక్క నీరు రాని పరిస్థితి ఏర్పడింది. పలమనేరు మండలంలో 114 చెరువులుండగా వీటిలో 43కు కట్టలు బలహీనంగా ఉన్నాయి. నాలుగు చెరువు కట్టలకు గండిపడి మూడేళ్లవుతున్నా పట్టించుకునే దిక్కులేకుం డా పోయింది. చాలా చెరువులకు మొరవలు ధ్వంసమయ్యాయి. సప్లయ్ చానెళ్లు కబ్జాకు గురయ్యాయి.
గంగవరం మండలంలో కొన్నేళ్లుగా వర్షాలు పడకపోవడంతో చెరువుల్లో చుక్క నీరులేదు. దీనికితోడు సప్లయ్ చానెళ్లు ఆక్రమణకు గురయ్యాయి. మన్నార్‌నాయనిపల్లె చెరువుకు గతంలో గండిపడినా మరమ్మతుకు నోచుకోలేదు. పెద్దపంజాణి మండలంలో 259 చెరువులుండగా చెన్నారెడ్డిపల్లె, వీరప్పల్లె, సొలింపల్లె, బేరుపల్లె, పెనుగొలకల గ్రామాల్లోని చెరువులకు గండ్లు పడ్డాయి. వాటికి నామమాత్రంగా మరమ్మతు చేసి చేతులు దులుపుకున్నారు.
బెరైడ్డిపల్లె మండలంలో 150 చెరువులున్నాయి. 15 మినహా మిగిలిన వాటిలో సప్లై చానెళ్లు ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. చెరువు స్థల మూ ఆక్రమణకు గురైంది. వి.కోట వుండలంలో 183 చెరువులుండగా కీలపల్లె, చింతల ఎల్లాగరం, బైరుపల్లె చెరువులు ఆక్రవుణకు గురయ్యూరుు. పది చెరువు కట్టలు బలహీనంగా ఉన్నాయి.
పీఆర్ చెరువుల పరిస్థితి మరీ అధ్వానం
గతంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉండి ఇరిగేషన్ శాఖకు బదిలీ అయిన చెరువులు చాలావర కు అధ్వానంగా ఉన్నాయి. వీటి గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. నియోజకవర్గంలోని చెల్లెమ్మ చెరువు, సర్కార్‌పెద్దచెరువు, కౌండిన్యా ఆనకట్ట, ఆరె మ్మ, కన్నికల, నాయిని, దండపల్లె, బెరైడ్డిపల్లె పెద్దచెరువులు, పాతపేట చెరువు, బైరుపల్లె, ఎల్లాగరం, కీలపల్లె, బ్రాహ్మణపల్లె, చలమంగళం, మాడి చెరువుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణప్పను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఏపీసీబీ టీఎంపీ, వర్డల్‌బ్యాంక్ నిధుల ద్వారా కొన్ని చెరువులకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. త్రిబుల్‌ఆర్(రిపేర్స్ రెన్నివేషన్ అండ్ రిస్టోరేషన్) ద్వారా కొన్నింటికి, ఉపాధి హామీ ద్వారా 80 చెరువులకు త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు.