నీచ రాజకీయాలు తగవు | Worst politics tagavu | Sakshi
Sakshi News home page

నీచ రాజకీయాలు తగవు

Published Sun, Nov 23 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

Worst politics tagavu

కర్నూలు(రాజ్‌విహార్): టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక భాగ్యనగర్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో విఫలమై ప్రజల విశ్వాసం కోల్పోయిన ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోందన్నారు.

మొన్నటి వరకు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీదేవిపై అవిశ్వాసానికి తీవ్ర ప్రయత్నాలు చేయగా హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో గెలుపొందిన జెడ్పీటీసీ సభ్యులు ఆరుగురిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీ వైపు తిప్పుకుని జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న నీచ సంస్కృతి ఆ పార్టీ నేతలదన్నారు. తాజాగా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్ జిల్లా చైర్మన్ రాంపుల్లయ్య యాదవ్‌పై అవిశ్వాసానికి సిద్ధపడ్డారన్నారు.

ఈ క్రమంలో ఇరువురు డెరైక్టర్లు పెద్దిరెడ్డి, తమ్మన్నలను కిడ్నాప్ చేశారని మరో డెరైక్టర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. ఎలాంటి ఆధారం లేకపోయినా రాంపుల్లయ్య ఇంటికి వెళ్లి శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టడం సమంజసం కాదన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని.. కనీసం తప్పుడు కేసులను నిర్ధారించుకోవాలనే ఆలోచన రాకపోవడం శోచనీయమన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తామన్నారు.

కోర్టులు తీవ్రంగా పరిగణించి ఉద్యోగాలు పోతే టీడీపీ నేతలు కాపాడలేరనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. గోనెగండ్ల మండలం కులుమాలకు చెందిన జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్ డెరైక్టర్ కె.పెద్దిరెడ్డి మాట్లాడుతూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నారు. ఉల్లిగడ్డల వ్యాపారంలో భాగంగా తాడేపల్లిగూడెంకు వెళ్లానన్నారు.

ఆదోని మండలం బైచిగేరికి చెందిన మరో డెరైక్టర్ కె.తమ్మన్న మాట్లాడుతూ తనను కూడా ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. దైవదర్శనార్థం తిరుపతికి వెళ్లొచ్చానన్నారు. తామిద్దరి విషయంలో తప్పుడు కేసు బనాయించినట్లు చెప్పారు. చైర్మన్ రాంపుల్లయ్య యాదవ్‌కే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో రాంపుల్లయ్య యాదవ్ తనయుడు గోపినాథ్ యాదవ్ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement