ధర్మవరం టౌన్, న్యూస్‌లైన్: వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే కొనసాగించగలరని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. నాటి సువర్ణ పాలన తిరిగి రావాలంటే జగన్‌ను సీఎం చేయడమే మార్గమన్నారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి చెందిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, విద్యార్థులు ఎమ్మెల్యే కేతిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి, హనుమంతరెడ్డి నేతృత్వంలో పార్టీలో చేరిన విద్యార్థులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత రాజకీయంగా ఎదగాలన్నారు. సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి తాను ఐదేళ్లలో చేసి చూపానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. వైఎస్ ప్రతిష్టను తగ్గించేందుకు అయన అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు అటకెక్కించారని విమర్శించారు. వైఎస్ పథకాలను విమర్శించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు ఆ పథకాలను అమలు చేస్తానని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ప్రజలను వంచిస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహనరెడ్డి ముందు నుంచీ సమైక్యవాదాన్నే వినిపిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి మద్దతు తెలపాలని జాతీయ నాయకులను కోరారన్నారు.
పార్టీలో చేరిన వారిలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బి కొండారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్‌రెడ్డి, వై రాఘవేంద్ర, ప్రధాన కార్యదర్శులు సందీప్‌కుమార్, విజయ్‌కుమార్, మదనమోహనరెడ్డి, కార్యదర్శులు నబీరసూల్, రమేష్, సోమశేఖరరెడ్డి, కోశాధికారి భాస్కరరెడ్డి, కమిటీ సభ్యులు రాజశేఖరరెడ్డి, రామిరెడ్డి, కొండారెడ్డి, ముత్యాలు, రవీంద్రారెడ్డి ఉన్నారు. వీరితోపాటు ధర్మవరం ప్రాంతానికి చెందిన యూనివర్సిటీ విద్యార్థులు 500 మంది పార్టీలో చేరారు.
జగన్‌తోనే సువర్ణ పాలన
Published Wed, Dec 25 2013 1:55 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement