
బాబుకు ఎన్ని మార్కులేస్తారో మీ ఇష్టం: వైఎస్ జగన్
మంగళగిరి: ప్రజా బ్యాలెట్ ద్వారా చంద్రబాబు పాలనకు మార్కులు వేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు సర్కారుకు ప్రజలే మార్కులు వేసే విధంగా ప్రజాబ్యాలెట్ రూపొందించామన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి 'వై' జంక్షన్ సమీపంలో బుధవారం వైఎస్ జగన్ సమరదీక్ష చేపట్టారు. చంద్రబాబు ఏడాది పాలనపై 100 ప్రశ్నలతో తయారు చేసిన ప్రజా బ్యాలెట్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.
దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. బాబు సర్కారుకు ఎన్ని మార్కులు వేస్తారో ప్రజల ఇష్టమని అన్నారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా మార్కులు వేయాలని ప్రజలను కోరారు.