
ఆయనకు తప్ప...అందరికీ తెలుసు..
మంగళగిరి : 'మండుటెండను ఖాతరు చేయకుండా మంగళగిరిలో చేస్తున్న దీక్షకు విచ్చేసి... ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామన్న సంగతి ఇక్కడకు అశేషంగా విచ్చేసిన ఇన్ని వేలమంది దీక్షకు సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాలుపంచుకున్నది ఎందుకన్నది అందరికీ తెలుసు...అయితే ఒకే ఒక వ్యక్తికి మాత్రం తెలియదు. ఆ వ్యక్తి ఎవరూ అంటే చంద్రబాబు నాయుడు అన్న మాట వినిపిస్తోంది' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాను ఎందుకు దీక్ష చేస్తున్నానో రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలుసు...కానీ చంద్రబాబుకి మాత్రం తెలియదని ఆయన ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ జగన్ రెండు రోజుల పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన మాటలు ఏమిటీ... ఎన్నికల తర్వాత చంద్రబాబు చేస్తున్నది ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. రైతున్నలు చంద్రబాబు మాటలు నమ్మి ఓటు వేశారని అయితే అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను బాబు గాలికి వదిలేశారన్నారు. ప్రస్తుతం రైతన్నలు పడుతున్న అవస్థలు, అగచాట్లు అన్ని ఇన్నీ కావని, చివరకు వారు ఆత్మహత్యలు చేసుకునే వరకూ పరిస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ డ్వాక్రా అక్కచెల్లెమ్మలను పట్టపగలు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు.