పెద్ద అలవలపాడు ఘటనపై ఒంగోలు ఎంపీ సీరియస్
ప్రకాశం జిల్లా పెద్ద అలవలపాడులో టీడీపీ నేతల దాడిలో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సింగయ్య మృతిపై ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై వి సుబ్బారెడ్డి శుక్రవారం ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదే విషయంపై జిల్లా ఎస్పీతో సుబ్బారెడ్డి ఫోన్లో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ఎస్పీని కోరారు.
పెద్ద అలవలపాడులో రేషన్ షాపు డీలర్ అంశంపై అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. ఆ దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా సింగయ్య అనే కార్యకర్త మృతి చెందాడు. మిగిలిన ముగ్గురి పరిస్థితి ఆందోళనగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ఆర్ సీపీ నేత కత్తుల బ్రహ్మానందారెడ్డి శుక్రవారం పరామర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలిని ఆయన డిమాండ్ చేశారు.