ముంబై నుంచి కనిగిరికి ప్రత్యేక రైలు కోసం కృషి
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హామీ
సాక్షి, ముంబై : ముంబై నుంచి కనిగిరికి ప్రత్యేక రైలు కోసం కృషి చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఒంగోలు లోక్‌సభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అధికార పర్యటన నిమిత్తం నగరానికి విచ్చేసిన ఆయనను స్థానిక తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా కనిగిరి వాస్తవ్యుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కనిగిరి ప్రజలకు ముంబై నుంచి ప్రత్యేక రైలు కోసం కృషి చేస్తాననీ చెప్పారు.
ముఖ్యంగా తాను నెల్లూరు, తిరుపతి ఎంపీలతో కలిసి నడికుడి-కాళహస్తి రైలు మార్గం కోసం ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముంబై నుంచి కనిగిరికి ప్రత్యేక రైలు ఆవశ్యకత గురించి తనకు చెప్పారన్నారు. ముంబై, పుణే ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనీ, వారు ప్రతిసారి గుంతకల్ స్టేషన్లో దిగి మరో రైలు ద్వారా గమ్యస్థానం చేరుకోవాల్సిన పరిస్థితి ఉందని వెంకయ్యనాయుడు తనతో చెప్పారన్నారు.
ఇదే విషయాన్ని కనిగిరి ప్రజలు కూడా తన దృష్టికి తీసుకు వచ్చారని ఈ విషయమై తాను తప్పకుండా రైల్వే మంత్రి సురేష్ ప్రభు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. వచ్చే రైల్వే బడ్జెట్లో ఈ విషయమై ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తాననీ హామీ ఇచ్చారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరగాలని ఇందుకోసం ముంబైలో ఉంటున్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి తమ సహకారం అందించాలని సూచించారు.
ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడంతో తాను మరింత ఎక్కువ సమయం వెచ్చించి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి వెల్గొండ ప్రాజెక్టు పూర్తి అవడానికి శాయ శక్తుల కృషి చేస్తాననీ చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో వ్యవసాయ, తాగునీటి అవసరాలు తీరుతాయని అన్నారు. ఈ ప్రాజెక్టు రూప కల్పనకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని ఆయన చెప్పారు. జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాననీ ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తాననీ సుబ్బారెడ్డి చెప్పారు.
అదేవిధంగా జిల్లాలో రామయ్యపట్నం పోర్ట్ అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నాననీ తెలిపారు. తను అనుకున్న లక్ష్యాలు నెరవేరితే జిల్లా అభివృద్ధి చెందడమేకాకుండా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు, తర్వాత కూడా ఆయనకు ఆయన కుటుంబానికి వై.వి.సుబ్బారెడ్డి వెన్ను దన్నుగా నిలిచారనీ పేర్కొన్నారు.
ముఖ్యంగా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ఆర్కు వై.వీ.సుబ్బారెడ్డి ఎంతగానో సహకరించారని అన్నారు. అదేవిధంగా ముంబైతోపాటు పుణేలో ఉన్న కనిగిరి ప్రజల కోసం ప్రత్యేక రైలు నడిపించేందుకు ఒంగోలు ఎంపీ చర్యలు తీసుకోవాలని కొండారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో నవీముంబై బీజేపీ అధ్యక్షులు సీ.వి.రెడ్డితోపాటు వల్లభరావు, వి.వి.రెడ్డి, కేటీవీ రెడ్డి, ఎం.టీ.రెడ్డి, ఎస్.కాశిరెడ్డి, కే.భాస్కర్‌రెడ్డి, మోహన్రావ్లు పాల్గొన్నారు. ఎస్వీ క్లాసెస్ కరెస్పాండెంట్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.