సోనియా తీరుపై టీడీపీ నేత యనమల విమర్శ
Published Fri, Aug 23 2013 5:34 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
కొరిటెపాడు (గుంటూరు), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు తెరలేపి తెలుగువారి భవిష్యత్తును ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాశనం చేశారని ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణలు చేస్తున్న నిరవధిక నిరహార దీక్ష శిబిరం గురువారం నాలుగో రోజుకు చేరింది. యనమల దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేసీఆర్ సొత్తు కాదని రాష్ట్ర ప్రజలందరిదని గుర్తుచేశారు. స్వార్థరాజకీయాల కోసం రాష్ట్ర విభజన ప్రకటన చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు చాలా మంచివారని, అక్కడ రాజకీయనేతల స్వార్థ ప్రయోజనాల వల్లే రాష్ట్ర విభజన ప్రకటన చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు.
రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధానని చేయడం కోసమే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించారని, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు చూసైనా కేంద్రం విభజన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఒక వైపు సీమాంధ్ర జిల్లాలు, హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర మంటలు ఎగిసి పడుతుంటే సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు పదవులు పట్టుకుని వేలాడుతున్నారని, రాజీనామాలు చేయకుంటే వారికి రాజకీయ మరణశాసనం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం కోసం టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని వారి ఆటలు సాగవన్నారు. రాష్ట్ర విభజనపై యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆంటోని కమిటీ దొంగల ముఠా కమిటీ అని పేర్కొన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పదేళ్లుగా అధికారానికి దూరమై ఢిల్లీ చుట్టు ప్రదక్షణ చేస్తున్న దిగ్విజయ్‌సింగ్‌కు ఆంధ్రప్రదేశ్‌ను విభజించే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో తెలుగుజాతి మధ్య విద్వేషాలు ప్రజ్వరిల్లాయని విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన, రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. అనంతరం కబడ్డీ, కుర్చీల ఆటలు ఆడారు. దీక్షకు మద్దతు తెలిపిన వారిలో మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జేఆర్ పుష్పరాజ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, దాసరి రాజామాస్టారు, వెన్నా సాంబశివారెడ్డి, సహెచ్ మధు, కె.వీరయ్య, నిమ్మకాయల రాజనారాయణ, బోనబోయిన శ్రీనివాసయాదవ్, అనగాని సత్యప్రసాద్, పోతినేని శ్రీనివాసరావు, మల్లి, రావిపాటి సాయికృష్ణ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement