సాక్షి, గుంటూరు: ‘‘గత ఐదేళ్ల టీడీపీ పాలనలో తమ్ముళ్లు రెచ్చిపోయారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించారు. కుక్కను కొట్టారని, ఇంటి ముందు ఉమ్మి వేశారని ఇలా చిన్న చిన్న కారణాలకు కూడా కేసులు బనాయించి వేధించుకు తిన్నారు. ఐదేళ్ల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాం. ఆ కష్టాలు, బాధలు పగవారికి కూడా రాకూడదు’’ అంటూ గురజాల నియోజకవర్గంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు.
పిడుగురాళ్ల పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యే, నాయకుల నుంచి దాడులకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ఇతర వర్గాలకు చెందిన ప్రజలను హోం మంత్రి సుచరిత శనివారం పరామర్శించారు. కార్యక్రమానికి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీలకతీతంగా వందల మంది ప్రజలు కార్యక్రమానికి హాజరై గత ఐదేళ్ల టీడీపీ పాలనలో తాము పడ్డ కష్టాలు, బాధలను హోంమంత్రికి తెలియజేశారు. వైఎస్సార్ సీపీకి అండగా ఉన్నారని అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారని బాధితులు చెప్పుకున్నారు.
గత ఐదేళ్ల టీడీపీ పాలనలో తన, మన అనే బేధాలు లేకుండా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దోచుకున్నారని బాధితులు ఆరోపించారు. తమ మైనింగ్ క్వారీని యరపతినేని అనుచరులు కబ్జా చేస్తే అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సరిపూడి మల్లికార్జునరావు కుమారుడు బుజ్జి హోం మంత్రికి చెప్పుకున్నారు. మైనింగ్‌క్వారీ విషయంలో యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేక ఒకానొక సందర్భంలో తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు వివరించారు. ఇదే తరహాలో అనేక మంది బాధితులు యరపతినేని, ఆయన అనుచరుల అరాచకాలను, వేధింపులను గుర్తు చేశారు.
భరోసా ఇచ్చిన హోం మంత్రి సుచరిత :
గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల వేధింపులకు గురైన బాధితుల కష్టాలు, బాధలు విన్న హోం మంత్రి వారికి భరోసా ఇచ్చారు. గతంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, పార్టీ నాయకులపై నమోదు అయిన కేసులపై పునఃవిచారణ చేపడతామని వాగ్ధానం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల, పట్టణ కన్వీనర్లు చల్లా పిచ్చిరెడ్డి, చింతా వెంకటరామారావు, షేక్ జాకీర్ హుస్సేన్, సిద్ధాడపు గాంధీ, చౌదరి సింగరయ్య, మునగా పున్నారావు, అన్నారావు, జెడ్పీటీసీలు మాజీ సభ్యులు వీరభద్రుని రామిరెడ్డి, మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రేపాల శ్రీనివాసరావు, వివిధ విభాగాల నాయకులు కేవీ, కాలే మాణిక్యరావు, చింతారెడ్డి సుబ్బారెడ్డి, వున్నం నాగమల్లికార్జునరావు పాల్గొన్నారు.
పల్నాడు ప్రతిష్టను దిగజార్చవద్దు
పల్నాడు ప్రాంతంలో ఏదో జరగబోతుందని మాజీ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం కోసం పల్నాడు ప్రతిష్టతను దిగజార్చవద్దు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రశాంతంగా ఉన్న పల్నాడులో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది.
–శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీ
యరపతినేని, కోడెల బందిపోట్లు
గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్‌రావు బందిపోట్లు వలే ఐదేళ్ల పాటు అవినీతి, అక్రమాలు చేశారు. మాఫియా డాన్‌లుగా ఎదిగి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారు. కుందుర్తి గురవాచారి వంటి వారిని హింసించారు.
–కాసు మహేష్‌రెడ్డి, గురజాల ఎమ్మెల్యే
రాజకీయ స్వార్థంతో విమర్శలు
ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచకం సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజకీయ స్వార్థంతో విమర్శలు చేస్తున్నారు. కోడెల శివప్రసాదరావు, యరపతినేని ఎక్కడ తలదాచుకున్నారో చంద్రబాబుకు మాత్రమే తెలుసు. నిజాలను అసత్యాలుగా చూపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.
–పి.రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్
వారిని వెంటపెట్టుకుని పల్నాడుకు రావాలి
చంద్రబాబుకు ధైర్యం ఉంటే పల్నాడు పర్యటనకు యరపతినేని, కోడెలను వెంటపెట్టుకుని రావాలి. యరపతినేని తప్పుడు కేసులతో అనేక మందిని వేధించారు. అక్రమ మైనింగ్‌పై ఉద్యమాలు చేసిన తనపై కూడా వేధింపులు కొనసాగించారు. వాటిని లెక్కచేయకుండా పోరాటం చేశాం.
–జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ
20 కేసులు పెట్టారు
అక్రమ మైనింగ్‌పై కోర్టును ఆశ్రయించిన తనపై హత్య కేసులు, రేప్ కేసులు పెట్టించి బెదిరింపులకు యరపతినేని దిగారు. ఐదేళ్లలో తనపై 20కిపైగా కేసులు పెట్టించారు. చంద్రబాబు గొంతుచించుకుని కేకలు వేసినంత మాత్రన నిజాలు అబద్ధాలు కావు. చౌకబారు విమర్శలు మానుకోవాలి.
–టీజీవీ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
ఆత్మహత్య చేసుకునేంతగా..
యరపతినేని గెలుపు కోసం పనిచేశాం. మాకు దాచేపల్లి మండలంలోని కేశానుపల్లి గ్రామంలో క్వారీ ఉంది. యరపతినేని శ్రీనివాసరావు అనుచరులైన నెల్లూరి శ్రీనివాసరావు, ఎం.వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు అక్రమంగా క్వారీలోకి చొరబడ్డారు. యరపతినేని మమ్ములను బెదిరించారు.
–గడిపూడి బుజ్జి, మాజీ ఎమ్మెల్యే తనయుడు
ఎస్సీ, ఎస్టీ కేసు
మాచర్లలో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. తాను చేసే కాంట్రాక్ట్ పనుల్లో మామూళ్లు ఇవ్వలేదని నాపై 2014లో మెుదటి సారిగా మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారు. తాను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నానని ఇంత కక్ష సాధింపు చర్యలు ఇప్పటి వరకు చూడలేదు.
–ఉన్నం నరసింహారావు, కాంట్రాక్టర్
Comments
Please login to add a commentAdd a comment