సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కొందరు ఎన్నికల సమయంలో స్తబ్దుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కీలకంగా పని చేయాల్సిన తరుణంలో ముఖం చాటేయడం, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తదితరులు అధిష్టానం తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వారు పార్టీ వీడే ఆస్కారమూ ఉందనే వాదన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
పూర్తి దూరంగా పుల్లారావు
టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆ పార్టీ ముఖ్యనేత ప్రత్తిపాటి పుల్లారావు కొద్దికాలంగా పార్టీపై అసంతృప్తితో బయటకు రావడంలేదు. ఆయన ఇన్‌చార్జిగా ఉన్న చిలకలూరిపేట సీటును వేరే వారికి ఇచ్చేందుకు యత్నించడంతో ఆయన అడ్డుకున్నారు. ఆ తర్వాత అడపాదడపా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికీ రావడంలేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీపైనా స్పష్టత లేదు. గతంలో ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు.
పరపతి తగ్గిన యరపతినేని!
పల్నాడుకు చెందిన మరో కీలక నేత యరపతినేని శ్రీనివాసరావుకు పార్టీలో పరపతి పూర్తిగా తగ్గిందని సమాచారం. ఫలితంగా పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గురజాల నుంచి పోటీ చేస్తారో లేదో అనే సందిగ్ధం నెలకొంది.
అయ్యో.. ‘చింత’కాయల
ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అప్పుడప్పుడు మీడియాలో మాట్లాడుతున్నా పార్టీ వ్యవహారాల్లో గతంలో ఉన్నంత చురుగ్గా లేరని చర్చ జరుగుతోంది. ఆయన కుమారుడు విజయ్ కూడా ఇప్పుడు అంత క్రియాశీలకంగా లేరని సమాచారం. గతంలో టీడీపీ సోషల్ మీడియా వింగ్‌కు ఇన్‌చార్జిగా ఉన్న విజయ్‌ను తప్పించి ఆ బాధ్యతలను పయ్యావుల కేశవ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి టీడీపీకి, అయ్యన్న కుటుంబానికి దూరం పెరిగినట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా వారికి నచ్చడంలేదని చెబుతున్నారు.
లోకేశ్ తీరే కారణమా..?
ఇలా సీనియర్లంతా పార్టీపై అసంతృప్తితో మౌనంగా ఉండడానికి చినబాబు లోకేశ్ తీరే కారణంగా తెలుస్తోంది. ఆయన సీనియర్లను దూరం పెట్టడంతోపాటు వారికి వ్యతిరేకంగా జూనియర్లను ఎగదోయడం అసంతృప్తి జ్వాలలను పెంచిందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్తిపాటి, యరపతినేని తదితర సీనియర్ నేతలు పార్టీని వీడే ఆస్కారం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
లోలోన రగులుతున్న మరింత మంది
మరింత మంది సీనియర్లు లోకేశ్ తీరు కారణంగా లోలోన రగిలిపోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు అప్పుడప్పుడూ మీడియాలో ఘీంకరించడం తప్ప నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉండడం లేదు. ఆయన్ను పార్టీ క్యాడర్ పట్టించుకోవడంలేదు. అసమ్మతి పెరిగిపోవడంతో ఈసారి ఆయనకు సీటు లేదని లోకేశ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన మిన్నకుండిపోయారు.
ఏలూరు జిల్లాలో కీలక నేత చింతమనేని ప్రభాకర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిమ్మకాయల చినరాజప్ప, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేఈ ప్రభాకర్ వంటి నేతలూ చురుగ్గా ఉండడంలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడూ మొక్కుబడిగానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. లోకేష్ కోసం ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమే కాకుండా తరచూ మీడియా సమావేశాలు కూడా నిర్వహించనీయడం లేదని తెలుస్తోంది.
అందుకే ఆయన పత్రికా ప్రకటనలతో అచ్చెన్న సరిపెట్టుకుంటున్నారు. పేరుకు అధ్యక్షుడైనా లోకేష్ ఆయన్ను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని లోలోపల ఆవేదన చెందుతున్నారని సమాచారం. ఇంకా చాలామంది సీనియర్లు ఇలాగే స్తబ్దుగా ఉండడంతో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోకపోవడం, లోకేశ్ వ్యవహార శైలితో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment