నందికొట్కూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసాలను జనం గమనిస్తున్నారని..ఇక ఆయన ఆటలు సాగవని వైఎస్‌ఆర్‌సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని ఆయన స్వగృహాంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందన చూసి సీఎంకు భయం పట్టుకుందన్నారు. ఆయన చేసిన మోసాలను రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పి బాధపడుతున్నారన్నారు. వారంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరలోనే వేటు పడుతుందని, ఇప్పటికే వారిపై చర్యలు తీసుకోవాలని తమ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించిందన్నారు.
మంత్రి ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ గుర్తుపై గెలవాలని సవాల్ విసిరారు. పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని మాయమాటలు చెప్పడం ఆయన మానుకోవాలని హితవు పలికారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల గెలుపుపై నమ్మకం లేకే సీఎం వారితో రాజీనామా చేయించడం లేదన్నారు. ఈ నెల 20వ తేదీన బేతంచర్లలో జరిగే వైఎస్ జగన్ బహిరంగ సభకు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మండలాల కన్వీనర్లు లక్ష్మీకాంతంరెడ్డి, రమాదేవి, లోకేష్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నాయకులు నాగభూషణంరెడ్డి, వెంకటరెడ్డి, అయ్యపురెడ్డి, దివాకర్‌రెడ్డి, సాయి, చిట్టిరెడ్డి, ఏసన్న, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment