త్వరలో ఫ్రీజోన్‌గా అమరావతి: సీఎం
- రాజధానిలో అందరికీ ఉద్యోగ అవకాశాలు
- సీఎం చంద్రబాబు వెల్లడి
- ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం జాతికి అంకితం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాజధాని ప్రాంతం కావడంతో అందరికీ ఉద్యోగ అవకాశాలు లభించేందుకు వీలుగా త్వరలో ఫ్రీ జోన్ చేస్తామన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కర్నూలు–కడప కాలువ (కేసీ కెనాల్)కు మళ్లించేందుకు ఉద్దేశించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని.. స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేయడం ద్వారా సోమవారం జాతికి అంకితం చేశారు. అనంతరం తడకనపల్లెలో నిర్వహించిన జన్మభూమి సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముచ్చుమర్రి చరిత్రలో నిలిచిపోతుందని, మార్చి నాటికి అన్ని పనులు పూర్తిచేసి, నాలుగు పంపుల ద్వారా నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎన్టీఆర్ సమయంలో ప్రణాళిక వేసి చేపట్టిన ప్రాజెక్టులను తన హయాంలో పూర్తిచేసే భాగ్యం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యూహరచనలో తనను మించినవారు ఎవరూ లేరని కితాబునిచ్చుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలపకపోతే ప్రమాణ స్వీకారం కూడా చేయనని ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రానికి తేల్చిచెప్పానన్నారు. తాను డిమాండ్ చేసినందుకే ఆ మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్, చట్టం చేశారని చెప్పారు.
కర్నూలును అభివృద్ధి చేయకూడదు
కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కు ఏర్పాటు కానుందన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో తమ పార్టీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయని, ఈ లెక్కన ఇక్కడ అభివృద్ధి చేయకూడదని, కానీ అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.
(చదవండి :తమ్ముడూ... విను..నేను చెప్పేది విను..)
కర్నూలు సభలో అనంత ఎంపీ జేసీ
ఈ సభలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దర్శనమివ్వడమే కాకుండా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు కృతజ్ఞత చూపించాలని జేసీ అన్నారు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ‘బాబు ఏమైనా గాంధీ మహాత్ముడా.. ఆయన సభకు జనం రావ డానికి’ అని జేసీ వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీని పిలిపించి సీఎం మాట్లాడించారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జేసీ మనస్సులో ఉన్నది మాట్లాడుతుంటారని, ఇది తనకు కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలు తెచ్చిపెడుతుందన్నారు.
ఏపీలో ప్రాజెక్టులు వైఎస్ భిక్షే: ఐజయ్య
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భిక్షేనని నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య స్పష్టం చేశారు. తడకనపల్లెలో సోమవారం నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. ముచ్చుమర్రి ప్రాజెక్టుకు పునాది వేసింది వైఎస్సేనని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు పునాది వేసింది కూడా ఆయనేనని తెలిపారు. ఆ ప్రాజెక్టుల్నే ఇప్పుడు మీరు ప్రారంభిస్తున్నారని అన్నారు. పునాదులు వేసి పనులు చేసిన వాళ్లను విస్మరించడం సమంజసం కాదని అన్నారు. ఐజయ్య వైఎస్ పేరు ప్రస్తావించగానే సభలో పాల్గొన్న ప్రజలు ఈలలు, కేకలతో హర్షధ్వానాలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా తానే ప్రాజెక్టులు చేపట్టి ప్రారంభిస్తున్నానని, రాయలసీమను సైతం సస్యశ్యామలం చేశానని చెప్పుకుంటున్న సీఎం.. వైఎస్‌ను ఐజయ్య గుర్తుచేయడం, సభికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే రాజకీయాలు మాట్లాడవద్దంటూ ఎమ్మెల్యే మైక్‌ను కట్ చేయించారు.
మైక్ లేకపోయినా ఐజయ్య మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు 2007లోనే రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. హంద్రీ–నీవా, ముచ్చుమర్రికి కలిపి రూ.120 కోట్లు కూడా కేటాయించారని చెప్పారు. ఆయన అకాల మరణంతో ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. సీఎం మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నేను ఏమంటానంటే ఎన్టీఆర్‌గారు ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవన్నీ. ఆ ప్రాజెక్టులకు మళ్లీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేశా. రాజకీయం చేయాలంటే.. కరెక్టు కాదు. కాలువలు ఉండవచ్చు. శివరామకృష్ణయ్య.. ఇప్పుడు దివాకర్‌రెడ్డిగారు చెప్పినట్లు ఎప్పుడో గీతలు గీశారు...’ అని చంద్రబాబు అన్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డిలు ఐజయ్య వద్ద ఉన్న మైక్‌ను తీసుకుని కూర్చోబెట్టారు.