
పుంగనూరు టౌన్ : తెలుగుదేశం పాలనలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని వైఎస్సార్‌సీపీ మహిళావిభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా విమర్శించారు. శనివారం పుంగనూరులో ఆమె వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. పేదవాడికి నిత్యావసరాలు అందజేసే రేషన్ వ్యవస్థ టీడీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. బియ్యం తప్ప మరే ఇతర నిత్యావసరాలు రేషన్‌షాపుల్లో ఇవ్వడం లేదని తెలిపారు. దోమలపై దండయాత్ర పేరుతో కోట్లాది రూపాయలు భోంచేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని, రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు.
మంత్రి నారా లోకేష్ ప్రతి సమావేశంలోనూ లక్షల కిలోమీటర్ల సీసీరోడ్లు అంటూ ప్రకటనలిస్తున్నారని, సీఎం సొంత జిల్లాలోనే ఇప్పటికీ కొన్ని గ్రామాలకు మట్టిరోడ్లు లేకపోవడం దౌర్భాగ్యమని తెలిపారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన వియ్యంకుడనో, టీడీపీ ఫైనాన్సియర్ అనో చూడకుండా నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి సహజమని, మూడేళ్లు వర్షాలు లేక కరువుతో బాధపడితే, నేడు వరదలతో నష్టపోయే పరిస్థితి దాపురించిందని తెలిపారు. పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి ప్రజలు, రాష్ట్రం గురించి సీఎం ఆలోచించకపోతే టీడీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలం దరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment