యోగాసనాలు వేస్తున్న చంద్రబాబు నాయుడు
సాక్షి, అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘అంతర్జాతీయ యోగా దినోత్సవ’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని తన నివాసం వద్ద గ్రీవెన్సు హాల్లో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ‘రోజూ గంటసేపు యోగా చేస్తే ఎంతో ప్రశాంతంగాత ఉంటుంది. యోగా భారతీయ వారసత్వ సంపద. మన రోజు వారి జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలి. ఆనందం, ఆరోగ్యం మరచి డబ్బులు వెంట పడి అనర్థాలు కొనితెచ్చుకుంటున్నాం. కుటుంబ వ్యవస్థతో ఎన్నో ఒత్తిళ్లకు దూరం కావొచ్చు. యోగా-కుటుంబ వ్యవస్థ నిత్య జీవితంలో ఒక భాగం కావాలి. మనిషి మనిషిగా బతకాలంటే యోగా - ధ్యానం గొప్ప సాధనాలు.
ప్రకృతితో అనుసంధానమై యోగా చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వారసత్వ సంపద అయిన యోగాని కాపాడుకోవడం అందరి బాధ్యత శారీరక వ్యాధుల కంటే మెదడు కు సంబంధిత వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. దీనికి ఒత్తిళ్లే కారణం. మెదడును నియంత్రించుకోవాలంటే యోగా గొప్ప సాధనం’ అన్నారు.
హైదరాబాద్‌లో...
అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్బంగా గవర్నర్ దంపతులు యోగాసనాలు వేశారు. రాజ్ భవన్‌లోని సంస్కృతి హాల్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, రాజ్ భవన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ‘ఒక్క రోజు మాత్రమే కాక...నిత్యం యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు’ అని గవర్నర్ పేర్కొన్నారు.
విశాఖ తీరాన...
విశాఖ తూర్పు నౌకాదళంలో అంతర్జాతీయ యోగదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక యోగసనాల్లో నావికా సిబ్బంది కుతుబసమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ హజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment