కర్నూలు: విద్యుత్ షాక్ తగిలి యువరైతు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా పెద్దకడగూరు మండలం కలకుంట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాము(26) అనే రైతు పొలాన్ని చదును చేయడానికి ఈ రోజు ఉదయం ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. ఆ సమయంలో.. సోమవారం రాత్రి వీచిన భారీ గాలులకు పొలంలో వెదురు బొంగులతో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. దీంతో వాటిని తొలగించడానికి ప్రయత్నించిన రాము విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.