
శీలం వెంకన్న (ఫైల్)
తూర్పుగోదావరి, తాళ్లరేవు (ముమ్మిడివరం): నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడ్ని డెంగీ బలి తీసుకుంది. దీంతో అతడి కుటుంబంలో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది. మండలంలోని శుంకరపాలెం గ్రామ మాజీ సర్పంచి శీలం నాగేశ్వరరావు ద్వితీయ కుమారుడు శీలం వెంకన్న (26) ఇటీవల అనారోగ్యంగా ఉండటంతో గ్రామంలోని ఆర్‌ఎంపీని వైద్యం చేయించారు. అతని పరిస్థితి విషమం కావడంతో కాకినాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చడంతో అతడికి డెంగీ సోకిందని అక్కడి వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స పొందుతుండగా ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారని చెప్పారు. వెంకన్నకు ఇటీవలే పెండ్లి నిశ్చితార్థం అయిందని, మరో నెలలో వివాహం కానుందని వారు విలపిస్తూ తెలిపారు. గ్రామంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, వీటిని నిరోధించాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్యం క్షీణించిందని, వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు గ్రామానికి రావడం లేదని వారు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment