శృంగవరపుకోట, న్యూస్‌లైన్: ఎస్.కోట రైల్వేస్టేషన్ వద్ద గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి రైల్వే వర్గాలు, మృతుని బంధువులు చెబుతున్న కథనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి స్టేషన్‌మాస్టర్ దేముడును వివరణ కోరగా గురువారం రాత్రి 11గంటల సమయంలో 26/6కి.మీ వద్ద వెంకటరమణపేట-ఎస్.కోటల మధ్య ప్రమాదం జరిగిందన్నారు. 25 నుంచి 30సంవత్సరాల మధ్య వయస్సున్న వ్యక్తి అకస్మాత్తుగా జుంబోట్రైన్ లోకో ఇంజిన్‌ను ఢీకొట్టాడు.
రైలు కింద పడిన వ్యక్తి సంఘటనా స్థలంలోనే చనిపోయాడని, తగిన చర్యలు తీసుకోవాలని జుంబోట్రైన్ లోకో పెలైట్ ఎం.వి.ఎస్.నారాయణ రాతమూలకంగా ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులకు, జీఆర్‌పీకి సమాచారం అందించామన్నారు. ఎట్టకేలకు సాయంత్రానికి మృతుడు వేపాడ మండలం బొద్దాం గ్రామస్తుడని తెలిసిందని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా బంధువులు అక్కడికి వచ్చారు. సంఘటనపై మృతుని బంధువులు మాట్లాడుతూ..బొద్దాం గ్రామానికి చెందిన కాపు శంకరరావు(30) లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు.
నెలరోజులుగా ఉపాధిలేకపోవడంతో ఎస్.కోట రైల్వేకాలనీలో ఉన్న తన స్నేహితుడు కాశీని గురువారం కలిసి ఏదైనా పని చూపించాలని కోరాడు. డాక్‌యార్డులో పనికి శుక్రవారం వెళ్దామని స్నేహితుడు చెప్పిన మీదట బహిర్భూమికి వెళ్తి వస్తానని రాత్రి 10గంటల సమయంలో బయటికి వెళ్లాడు. రాత్రి 12దాటినా రాకపోవడంతో శంకరరావు బొద్దాం వెళ్లిపోయి ఉంటాడనుకున్నానని కాశి చెబుతున్నాడు. తెల్లారేసరికి ఎస్.కోట రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌పై శవమై పడిఉన్నాడని చూసి కుటుంబసభ్యుల సమాచార మందించగా వారంతా ఆస్పత్రికి వచ్చి భోరుమన్నారు. బహిర్భూమికి వెళ్లి వస్తున్న సమయంలో రైలు ఢీకొట్టడంతో చనిపోయి ఉండొచ్చంటూ రోదించారు. మృతునికి భార్య గౌరి, కుమార్తె శ్యామల ఉన్నారు.
రైలు ఢీకొని యువకుడి మృతి
Published Sat, Aug 31 2013 4:54 AM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM
Advertisement
Advertisement