
కారేపల్లి: హోలీ పండగకు వచ్చి..తిరిగి హైద రాబాద్‌కు బయల్దేరిన ఓ యువకుడు రైలు నుంచి జారిపడి దుర్మరణం చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసు కుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గొల్లపల్లి లక్ష్మాతండాకు చెందిన బాణోతు యుగంధర్ (25) ఈ ప్రమాదంలో చనిపోయాడు. పాలిటెక్నిక్ డిప్లొమా, టీటీసీ పూర్తి చేసిన ఇతను హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ఇటీవల హైదరాబాద్ నుంచి ఇంటికి (లక్ష్మాతండా) వచ్చాడు.
హోలీ పండగను ఆనందంగా జరుపుకొని ఆదివారం రాత్రి 10గంటల సమయంలో బొమ్మనపల్లిలో లారీ ఎక్కి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి కాకతీయ ఫాస్ట్ పాసింజర్ రైలు ఎక్కిన యుగేందర్, రైలు డోర్ వద్ద కూర్చొని ఉంటాడని, గాంధీపురం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కొమ్ముగూడెం గేటు అతి మూల మలుపు వద్ద వెనుకనుంచి డోర్ వేగంగా నెట్టివేయడంతో అదుపు తప్పి రైలు కిందపడి మృతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన కొమ్ముగూడెం గ్రామస్తులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం రైలు కిందికి దూసుకుపోవటంతో..సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకుపోయి..నుజ్జునుజ్జుగా మారింది. ఘటనా స్థలంలో ఆ«ధార్ కార్డు, చేతివేలికి ఉన్న ఉంగరం, సెల్‌ఫోన్ ఆ«ధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
యుగేందర్ ప్రమాదవశాత్తూ మృతి చెందాడా..? లేక ఆత్మహత్యానా..? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాంధీపురం రైల్వే స్టేషన్ నుంచి కారేపల్లి రైల్వే స్టేషన్ వరకు రైల్వే ట్రాక్ అత్యంత మూలమలుపు కలిగి ఉంటుంది. ఇక్కడ బోగీలు ఓవైపునకు ఒంగినట్లు అవుతాయి. అప్పుడు డోర్ వద్ద ఉన్న వారు ప్రమాదాలకు గురవుతుండడం ఇటీవల పెరిగింది.
లక్ష్మాతండాలో విషాదం..
టేకులపల్లి: చేతికి అందొచ్చిన కొడుకు ఉద్యోగం చేసి ఇంటికి ఆసరాగా ఉంటాడనుకుంటే..ఇలా దుర్మరణం చెందడంతో..అతడి స్వగ్రామం బొమ్మనపల్లి పంచాయతీ లక్ష్మాతండాలో విషాదం అలుముకుంది. మాజీ సర్పంచ్ బాణోతు ఆల్యానాయక్, సోనా దంపతుల కుమారుడైన ఇతను ఇంటర్మీడియట్ వరకు కొత్తగూడెంలో చదివాడు. డిప్లొమా, ఉపాధ్యాయ శిక్షణ హైదరాబాద్‌లో పూర్తి చేసి, ఇటీవల టీఆర్‌టీ పరీక్ష కూడా రాశాడు. హోలీ పండగకు స్వగ్రామానికి వచ్చి..ఆదివారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు బయల్దేరి..ఇలా ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, టేకులపల్లి జెడ్పీటీసీ లక్కినేని సురేందర్ సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment