
బొండపల్లి: మండలంలోని బిళ్లలవలస జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై బొలేరో వాహనం ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం మండలం ఎం. వెంకటాపురం గ్రామానికి చెందిన మత్స గణేష్ (24), మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన సొడ్రోతు నాగరాజు (26) సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బొండపల్లి మండలంలోని అంబటివలస గ్రామానికి వెళ్లారు. అక్కడ పని ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరారు.
బిళ్లలవలస జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఒడిశా నుంచి విశాఖపట్నం వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొట్టడంతో వాహనం నడుపుతున్న గణేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుకు కూర్చున్న నాగరాజు త్రీవంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సుదర్శన్ సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు. మృతుడు గణేష్‌కు తల్లి లక్ష్మి, సోదరుడు వెంకటేష్ ఉన్నారు. ఈ సంఘటనతో ఎం. వెంకటాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.