నవీన్ మృతదేహం
మహబూబాబాద్ రూరల్ : పుట్టిన రోజునాడే ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. స్నేహితులతో కలిసి బైక్‌పై దైవదర్శనానికి వెళ్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలంలోని బేతోలు గ్రామంలోగల జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథ నం ప్రకారం... మహబూబాబాద్ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన మంచాల చినవెంకన్న ఏకైక కుమారుడు నవీన్(18) పట్టణంలోని వికాస్ జూనియర్ కళాశాలలో ఎంఎల్‌టీ పూర్తి చేశాడు.
డిగ్రీ అడ్మిషన్ పొందేందుకు ద్రువీకరణ పత్రాలు అవసరం ఉండడంతో మానుకోట మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం బుధవారం తన పుట్టిన రోజు కావడంతో మానుకోట పట్టణ శివారులోని గిరిప్రసాద్‌నగర్ కాలనీకి చెందిన ముంజల ప్రశాంత్‌కు చెందిన పల్సర్ వాహనంపై కురవి వీరభద్ర స్వామి దర్శనానికి బయల్దేరాడు. కోడి నవీన్ డ్రైవింగ్ చేస్తుండగా ముత్యాల సాగర్, ముంజల ప్రశాంత్, మంచాల నవీన్ కూర్చున్నారు.
వారు బేతోలు గ్రామంలోని జాతీయ రహదారిపైకి చేరుకోగానే ఎదురుగా గేదెలు వస్తుండడంతో బైక్ వేగం తగ్గించి నెమ్మదిగా వెళ్తున్నారు. ఇదే సమయంలో కురవి వైపు వెళ్తున్న కారు కూడా ఒక్కసారిగా వారి బైక్ పక్కకు వచ్చింది. ఈ క్రమంలో బైక్‌ను కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో బైక్ అదుపుతప్పగా వెనక కూర్చున్న మంచాల నవీన్ కిందపడిపోయాడు. పక్కనే ఉన్న రూట్‌బోర్డుకు బైక్ ఢీకొంది. స్థానికులు గమనించి అతడిని 108లో ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
కోడి నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా పుట్టిన రోజునే మృత్యు ఒడికి చేరిన నవీన్ మృతదేహంపైపడి అతడి బంధువులు రోదించిన తీరు అందరిని కలచి వేసింది. నవీన్ మృతదేహాన్ని మానుకోట జిల్లా కోర్టు మాజీ ఏజీపీ కొంపెల్లి వెంకటయ్య, జెడ్పీటీసీ సభ్యుడు మూలగుండ్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి అయిలయ్య, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు గార్లపాటి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బూర్ల ప్రభాకర్ సందర్శించారు. సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులు కురవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై నాగభూషణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంచాల నవీన్ మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment