రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Published Tue, Oct 1 2013 2:21 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
ఇరగవరం, న్యూస్‌లైన్ : బైక్ గోతిలో పడి అదుపుతప్పిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూరంపూడి గ్రామానికి చెందిన పెన్మెత్స చిట్టి సుబ్బరాజు(27) అతడి స్నేహితుడు అల్లూరి సతీష్‌తో కలిసి ఆదివారం సాయంత్రం బైక్‌పై తణుకు షాపింగ్‌కు వెళ్లారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో తిరిగి వస్తూ గోటేరు ఆంజనేయ స్వామి గుడి కల్వర్టు వద్ద ఉన్న గోతిలో బైక్ పడి అదుపుతప్పింది. ఈ ఘటనలో వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని 108 వాహనంలో తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి రాజమండ్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో సుబ్బరాజు మృతి చెందాడు. సతీష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్సై డి.పాండురంగ విఠల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామంలో విషాదఛాయలు
పెన్మెత్స చిట్టి సుబ్బరాజు మృతితో సూరంపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెన్మెత్స నీలాద్రి రాజు, సత్యవతి దంపతుల రెండో కుమారుడైన అతడు వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఆర్ అండ్ బీ రోడ్డుపై పడిన గొయ్యిని పూడ్చి లెవెల్ చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని, దీంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు.
Advertisement
Advertisement