యువకుడిని బలిగొన్న లారీ
Published Sun, Jan 12 2014 3:43 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
కొయ్యలగూడెం, న్యూస్‌లైన్ :చెరకులోడు లారీ అదుపుతప్పి పొలంలోని పాకలోకి దూసుకుపోయి బోల్తా పడటంతో పాకలో నిద్రిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మరణించారు. మండలంలోని రాజవరం-కేతవరం గ్రామాలమధ్య శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇవి.. రాజవరం గ్రామానికి చెందిన శింగంసెట్టి రాంబాబు(25) శుక్రవారం రాత్రంతా తన మొక్కజొన్న తోటకు నీరుపెట్టాడు. అతని తండ్రి చంద్రరావు ఇక విశ్రాంతి తీసుకోమని రాంబాబుకి చెప్పటంతో బాగా అలసిపోయిన అతను పొలంలోని పాకలో నిద్రపోయాడు. శనివారం మధ్యాహ్నం తాడువాయిలోని షుగర్ ఫ్యాక్టరీకి చెరకులోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి పాకలోకి దూసుకుపోయి రాంబాబుపై బోల్తా పడింది. అతను చెరకు కట్టలకింద ఉండిపోయాడు. స్థానికులు చెరకుకట్టల్ని తొలగించి చూడగా అతను అప్పటికే మరణించాడు.
రాంబాబు కష్టజీవి
విశ్రాంతి తీసుకోమని అన్నానని, ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చిందని తండ్రి చంద్రరావు విలపిస్తూ చెప్పాడు. అవివాహితుడైన రాంబాబుకి పెళ్లి సంబంధాలు చూస్తుం డగా ఆ ఇంట విషాదం మిగిలిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాంబాబు కష్టజీవిఅని, ఇద్దరు సోదరిలకు వివాహం చేశాడని, తమ్ముడుకికూడా వివాహం చేసిన తరువాత తాను పెళ్లిచేసుకుంటానని అంటుండేవాడని తల్లి జయమ్మ రోదిస్తూ తెలిపింది. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానిక రైతులు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.
Advertisement
Advertisement