ప్రేమ మధురం...ప్రియుడు కఠినం | young woman brutal murder in Visakhapatnam | Sakshi
Sakshi News home page

ప్రేమ మధురం...ప్రియుడు కఠినం

Published Sun, Jul 9 2017 4:54 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

ప్రేమ మధురం...ప్రియుడు కఠినం - Sakshi

ప్రేమ మధురం...ప్రియుడు కఠినం

ప్రియుడి చేతిలో ప్రియురాలి హతం!
పండావీధిలో దారుణం
అన్ని కోణాల్లోనూ పోలీసుల దర్యాప్తు



డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణం) : ప్రియుడే సర్వస్వం అనుకుంది. అనుమానిస్తున్నా.. ఆగ్రహిస్తున్నా అతనితోనే జీవితం పంచుకోవాలనుకుంది. అందుకోసం అందివచ్చిన ఉద్యోగాన్నీ వదులుకుంది... అయినప్పటికీ ప్రియుడి కాఠిన్యం ముందు ఆమె ప్రేమ నిలవలేకపోయింది. దారుణ హత్యకు గురై తనువు చాలించింది. నగర పరిధి పండావీధిలో శనివారం మధ్యాహ్నం ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...

జీవీఎంసీ 26వ వార్డు పరిధి పండావీధికి చెందిన బొందలపూడి సతీష్‌(23), రంగిరీజువీధికి చెందిన బురళి భవానీ(19) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పటి నుంచి ప్రేమికులు. వీరిద్దరి ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డుచెప్పకపోవడంతో సతీష్‌ ఇంటికి భవానీ, భవానీ ఇంటికి సతీష్‌ తరచూ రాకపోకలు సాగిస్తుండేవారు. రెండేళ్ల కిందట సతీష్‌ స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై అరకు వెళ్లాడు. అప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి కొంత కాలం మంచానికే పరిమితమయ్యాడు. అయినప్పటికీ భవానీ  మాత్రం సతీష్‌తో ప్రేమను కొనసాగిస్తూనే ఉంది. సతీష్‌ కోమా నుంచి తేరుకున్న తర్వాత కూడా వీరిద్దరి ప్రేమాయణం బాగానే సాగిం ది. ఎప్పటిలానే సతీష్‌ తల్లిదండ్రులిద్దరూ శనివారం ఉదయం కూలి పనికి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రంగిరీజువీధిలో ఉంటున్న భవానీ పండావీధిలోని సతీష్‌ ఇంటికి వచ్చింది. వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నట్టు స్థానికులు తెలిపారు. 2.30 గంటల ప్రాంతంలో సతీష్‌ ఉంటున్న ఇంటి నుంచి స్థానికులకు రక్తధార కనిపించడంతో పరిశీలించారు. రక్తపు మడుగులో భవానీ నిర్జీవంగా కనిపించడంతో సతీష్‌ను నిలదీశారు. సమాధానం చెప్పకపోవడంతో చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. తీవ్ర గాయాలతో ఉన్న సతీష్‌ను పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు వచ్చి అన్ని కోణాల్లో ఆరా తీశారు. క్లూస్‌ టీం వివరాలు సేకరించింది. హత్య చేశాడా? పెళ్లి చేసుకోనని చెబితే ఆ అమ్మాయే ఆత్మహత్య చేసుకుందా? వీరిద్దరి మధ్య ఏమైనా తగదా జరిగిందా? తదితర వివరాలు సేకరిస్తున్నారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానంతోనే హత్య..!
నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగుతున్నప్పటికీ సతీష్‌కు భవానీపై అనుమానం పెరిగింది. భవానీతో పాటు ఆమె తల్లిదండ్రులతోనూ తరచూ గొడవకు దిగుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగం వచ్చినప్పటికీ సతీష్‌ ఎక్కడ దూరమైపోతాడో అన్న భయంతో చేరకుండా వదులుకుంది. మరోవైపు సతీష్‌ మానసిక స్థితిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల కిందట జరిగిన ప్రమాదంతో కోమాలోకి వెళ్లిపోయిన సతీష్‌ అనంతరం తేరుకున్నాడు. అయితే నిత్యం ప్రతివారితోనూ గొడవలు పడేవాడని, మానసిక పరిస్థితి బాగులేదని స్థానికులు తెలిపారు. మరోవైపు కూతురు ఇంటికి వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు మధ్యాహ్నం 2.30గంటలకు భవానీ చనిపోయనట్లు ఫోన్‌ రావడంతో షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. భవానీ తండ్రి ఢిల్లీరావు డాక్‌యార్డ్‌లో వర్కర్‌. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. అక్క దేవిశ్రీ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. తమ్ముడు మనోజ్‌ చదువుతున్నాడు. సతీష్‌ ఇలా ఎందుకు చేశాడో తమకు తెలి యడం లేదని అతని తల్లిదండ్రులు సత్యవతి, నూకరాజు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement