సాక్షి, రాప్తాడు: చదువుకుంటానని చెప్పినా తల్లిదండ్రులు వినకుండా పెళ్లి ఏర్పాటు చేయడంతో మనస్తాపానికి గురైన యువతి మంచిమాటకు ముందు రోజు బలవన్మరణానికి పాల్పడింది. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కందుకూరు క్రాస్ సమీపంలోని ముస్లిం మైనార్టీ కాలనీలో షేక్ వహీదా, షేక్ మసూద్ మహబూబ్ బాషా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. రెండో కుమార్తె షేక్ మసూద్ షాహీన్ (20) అనంతపురంలో ఇంటర్ పూర్తి చేసింది. చదవండి: ఇది మదురై కాదా..!
ఈ మధ్యనే మంచి సంబంధం కుదరడంతో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. బుధవారం మంచి మాట చేసుకోవాల్సి ఉంది. తాను చదువుకుంటానని, మూడేళ్ల తర్వాత అయితే పెళ్లి చేసుకుంటానని షాహీన్ తల్లిదండ్రులకు తెలిపింది. మంచి సంబంధం కుదిరిందని, పెళ్లి తర్వాత అయినా చదువుకోవచ్చని తల్లిదండ్రులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సోమవారం రాత్రి షాహీన్ ఇంట్లోనే ఇనుపతీరుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇంటి బయట నిద్రిస్తున్న తల్లిదండ్రులు మంగళవారం ఉదయం తలుపులు తట్టగా ఎంతసేపటికీ తెరవలేదు. కిటికీలోంచి తొంగి చూడగా కూతురు ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇరుగుపొరుగు వారిసాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికెళ్లి చూసే సరికే షాహీన్ ప్రాణాలు వదిలింది. తహసీల్దార్ రామాంజనేయరెడ్డి, ఎస్‌ఐ ఆంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.
చదవండి: 11 నెమళ్లకు విషం పెట్టి చంపేశారు
Comments
Please login to add a commentAdd a comment