మంత్రిగారూ...మీ హామీలకు ఏడాది | Your assurances one year | Sakshi
Sakshi News home page

మంత్రిగారూ...మీ హామీలకు ఏడాది

Published Sat, Aug 15 2015 4:10 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

మంత్రిగారూ...మీ హామీలకు ఏడాది - Sakshi

మంత్రిగారూ...మీ హామీలకు ఏడాది

- హంద్రీ-నీవాకు నీరు లేదు... ఒక్కరికీ డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వలేదు
- ‘అనంత’, ధర్మవరంలో భూగర్భడ్రైనేజీ సంగతేంటి?
- రూ.150కోట్లతో స్థాపిస్తామన్న ఎయిమ్స్ ఎక్కడ?
- మాటలకే పరిమితం... ఆచరణలో కనిపించని చిత్తశుద్ధి
సాక్షిప్రతినిధి, అనంతపురం:
ఏడాది పూర్తయింది. నేడు మళ్లీ జాతీయజెండా నీడన మంత్రి సునీత ప్రసంగించనున్నారు. గతేడాది ఆమె చెప్పిన హామీల్లో నేటికీ ఏ ఒక్కటీ నెరవేరలేదు. హంద్రీ-నీవా ద్వారా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరందించలేదు. జిల్లాలో ఏడాదిగా ఏ ఒక్క రైతుకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ మంజూరు చేయలేదు. ‘ప్రాజెక్టుఅనంత’ ను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది.  
 
చేసిన బాసలేవీ?:    
‘అనంత’ రైతును నాలుగేళ్లుగా కరువు వేధిస్తోంది. ఈ క్రమంలో ‘అనంత’ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. జిల్లా పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చూడాల్సిన గురుతర బాధ్యత ఇద్దరు మంత్రులపై ఉంది. అయితే ఏడాదిగా వీరు జిల్లాకే ఏ ఒక్క మేలు చేయలేకపోయారు. గతేడాది పంద్రాగస్టు వేడుకల నాడు మంత్రి చెప్పిన మాటలు నెరవేరితే కష్టాల్లోని ‘అనంత’ కాసింత కుదుటపడుతుందని అంతా భావించారు. కానీ ఆ హామీల్లో ఏఒక్కటి నెరవేరలేదు.
 
ఇవీ గతేడాది పంద్రాగస్టున చేసిన ప్రకటనల్లో ముఖ్యమైనవి:
- వందశాతం కరువు నివాణకు చర్యలు
- రూ.150కోట్లతో ఎయిమ్స్ అనుబంధ కేంద్రాన్ని నెలకొల్పుతాం
- ‘అనంత’లో రూ.395కోట్లతో...ధర్మవరంలో రూ.305కోట్లతో భూగర్భడ్రైనేజీ ఏర్పాటు
 
సూపర్‌స్పెషాలిటీ మంజూరు
జిల్లాను ఐటీహబ్‌గా తీర్చిదిద్దుతాంవీటితో పాటు చాలా అంశాలను ప్రస్తావించారు. అయితే కరువు నివారణకు ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా 2013కు సంబంధించి రూ.643కోట్ల ఇన్‌ఫుట్‌సబ్సిడీ రావాల్సి ఉంటే ఇస్తామని చెప్పి... తీరా పాత బకాయిలు ఇవ్వలేమని జిల్లా రైతులకు అన్యాయం చేశారు. హంద్రీ-నీవాకు ఈ ఖరీఫ్‌కే నీరిస్తామని గతేడాది నుంచి చెబుతున్నా ఇప్పటి వరకూ డిస్ట్రిబ్యూటరీపై దృష్టి సారించలేదు. కుప్పంకు నీరు తీసుకెళ్లేదాకా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయొద్దని (జోవో నెంబర్: 22) సీఎం చంద్రబాబు ఆదేశించారు. కనీసం దీనిపై కూడా 12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు నోరెత్తలేదు.  జిల్లాలో 4లక్షలమందికిపైగా కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్లారు. ప్రభుత్వం మాత్రం ఉపాధి కల్పించి వలసలను నివారించలేకపోతోంది.
 
ఇక రుణమాఫీ దెబ్బతో ఇన్సురెన్స్ కోల్పోయి, వడ్డీ భారం పడి తమకు రావాల్సిన వందలకోట్లు రూపాయలను ‘అనంత’ రైతులు కోల్పోయారు.
ఇలా ప్రభుత్వ చర్యలతో ‘అనంత’ అభివృద్ధి 20ఏళ్లు వెనక్కి వెళ్లిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈక్రమంలో నేడు ప్రసంగించనున్న మంత్రి మళ్లీ పాత హామీలే వల్లె వే స్తారా? లేదా? చిత్తశుద్ధితో వాస్తవ పరిస్థితులను వివరిస్తారో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement