కర్నూలు(అగ్రికల్చర్): ‘మీ పనితీరు ఏ మాత్రం బాగా లేదు. ఫిర్యాదులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. వారం రోజుల్లో మార్పు కనిపించాలి. లేకపోతే ఉపేక్షించేది లేదు’ అని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహులుపై కలెక్టర్ సీహెచ్ వియజమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ముగిసిన తర్వాత పత్రికల్లో వచ్చిన వార్తలపై సమీక్ష నిర్వహించారు. పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తున్నా స్పందన లేకపోవడాన్ని బట్టి మీ పనితీరు స్పష్టమవుతోందన్నారు. గతంలోనే వ్యాధులపై మ్యాపింగ్ చేయమని చెప్పినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ట్యాంకులను ఎన్ని రోజులకోసారి శుభ్రం చేయాల్సి ఉందని కలెక్టర్ డీపీఓ శోభ స్వరూపరాణిని ప్రశ్నించారు. 15 రోజులకోసారి శుభ్రం చేయాలని ఆప్రకారమే చేస్తున్నామని సమాధానం ఇవ్వడంతో ఒక్క గ్రామంలోనైనా ఇలా చేస్తున్నట్లు నిరూపిస్తారా అని మండిపడ్డారు. వేంపెంట డీలర్ల అవినీతిపై విచారణ ఎంతవరకు వచ్చిదని డీఎస్‌ఓను ప్రశ్నించగా గ్రామానికి వెళ్లి విచారణ జరిపానని, డీలర్ అవినీతి నిర్ధారణ కావడంతో చర్యలకు ఆర్‌డీఓకు సిఫారసు చేశామని వివరించడంతో కలెక్టర్ వెంటనే ఆర్‌డీఓతో ఫోన్‌లో మాట్లాడగా తనకు ఎటువంటి సిఫారసు రాలేదని సమాధానమిచ్చారు.
దీంతో కలెక్టర్ డీఎస్‌ఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీలరున్ సస్పెండ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, నీటి సమస్యపై పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కన్నబాబు, ఏజేసీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘మీ పనితీరు వెరీ పూర్’
Published Tue, Aug 12 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
Advertisement
Advertisement