ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజల నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫోన్ ద్వారా సమస్యలపై వినతులను స్వీకరించారు.
అనంతరం ప్రజాసమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చిన సమస్యల పరిష్కారం అంతంత మాత్రమే ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం వచ్చిన సమస్యలను వచ్చే వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలను పరిష్కరించకపోతే కారణాలను తెలపాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో జేసీ కన్నబాబు, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి సంపత్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దృష్టికి వచ్చిన సమస్యలు
పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలోని ఎస్సీ కాలనీలో కొందరు వ్యక్తులు నాటుసారా, మద్యం ఇళ్లలోనే విక్రయిస్తున్నారని, తక్షణమే అడ్డుకోవాలని ఓ వ్యక్తి కోరగా.. ఎక్సైజ్ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి అదుపు చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
దీపం పథకం కింద గ్యాస్ కనె క్షన్లు జూన్, జూలైల్లో మంజూరు అయ్యాయని, అప్పుడు పంచాయతీ ఎన్నికల కారణంగా పంపిణీ చేయలేదని, ఇప్పుడు అడిగితే ఇవ్వడం లేదని ఆళ్లగడ్డకు చెందిన కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ డీఎస్ఓకు తగిన సూచనలు ఇచ్చారు.
బేతంచెర్ల మండలం మండ్లవానిపల్లె గ్రామంలో తాగునీటిని ఇతరులు దౌర్జన్యంగా వ్యవసాయానికి వాడుకుంటున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పంపి విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.
కోవెలకుంట్ల మండలం కంపమల్లలోని ఊరకుంటను కొందరు ఆక్రమించి వ్యవసాయ భూమిగా మార్చుకున్నారని, పశువులకు నీరు లేని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు విన్నవించగా.. చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.