రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మూగ యువకుడిని దొంగ అనే నెపంతో స్థానికులు కొట్టి చంపారు.
మదనపల్లె (చిత్తూరు) : రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మూగ యువకుడిని దొంగ అనే నెపంతో స్థానికులు కొట్టిచంపారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలోని రంగనాథ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న షేక్ చాంద్‌పాషా (24) లారీ క్లీనర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి తన అక్క ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో కొందరు స్థానికులు అడ్డుకొని ఎక్కడికి వెళ్లి వస్తున్నావని ప్రశ్నించారు.
అతడు మూగవాడు కావడంతో సమాధానం చెప్పలేదు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు అతడిపై విరుచుకుపడ్డారు. మూగవాడు అనే విషయం తెలియక, అతన్ని దొంగగా భావించి తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక అతను మృతిచెందాడు. విషయం తెలుసుకున్న చాంద్‌పాషా తండ్రి అన్వర్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో మహిళలు కూడా పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.