వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్లలో మాట్లాడొద్దని ఎన్ని రకాలుగా హెచ్చరించినా.. చాలామంది పట్టించుకోరు. సరిగ్గా ఇదే ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది.
వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్లలో మాట్లాడొద్దని ఎన్ని రకాలుగా హెచ్చరించినా.. చాలామంది పట్టించుకోరు. సరిగ్గా ఇదే ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. అనంతపురం జిల్లా బత్తలపల్లి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పవన్ కుమార్ (19) అనే యువకుడు మరణించాడు. ఇతడు తాడిమర్రి మండలం ఏకపాదంపల్లికి చెందిన దంపతుల ఏకూక కుమారుడు. అనంతపురం నగరం పీవీకేకే కాలేజిలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. సోమవారం అనంతపురానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగొచ్చాడు. తర్వాత పనుందని గొట్లూరుకు మోటారు సైకిల్పై బయలుదేరాడు.
మార్గమధ్యంలో ధర్మవరం-బత్తలపల్లి రహదారిలోని పోట్లమర్రి సమీపంలోకి రాగానే సెల్ మోగింది. సెల్‌లో మాట్లాడుతూనే బైకు నడుపుతున్నాడు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న బొలెరో వాహనం అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పవన్‌కుమార్ను బొలెరోలోనే బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. వెనకనుంచి వచ్చే వాహనాలు హారన్ కొట్టినా వినిపించుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.