గవర్నర్ హరిచందన్‌ను కలిసిన భారతీయ సంతతికి చెందిన విదేశీ యువత
సాక్షి, అమరావతి : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు విలక్షణమైనవని.. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం వెల్లివిరుస్తుందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, భావ ప్రకటన వంటి మంచి అవకాశాలను భారత రాజ్యాంగం అందించిందని.. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే ఇటువంటి మౌలిక సూత్రాలను ప్రజలకు అందించగలుగుతున్నాయని వివరించారు. ‘భారతదేశం గురించి తెలుసుకోండి (నో ఇండియా)’ పేరిట కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల యువజనాభ్యుదయ శాఖలు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భారతీయ సంతతికి చెందిన వివిధ దేశాల యువత సోమవారం విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. భారతీయతపట్ల ఆసక్తితో ఫిజి, గయానా, మారిషస్, మయన్మార్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో తదితర దేశాల నుండి యువత రావటం ముదావహమన్నారు. రాష్ట్ర అధికారిక భాష తెలుగు ‘ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్‘గా ప్రసిద్ధిగాంచిందని చెబుతూ రాష్ట్ర విశిష్టతలను వారికి విపులంగా వివరించారు. అలాగే, దేశం మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ప్రవాస యువత భారత్ పర్యటనకు రావటం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వినీత్‌కుమార్, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment