వైఎస్సార్‌సీపీతోనే అందరి సంక్షేమం | YS Avinash Reddy Election Campaign In Kadapa Constituency | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీతోనే అందరి సంక్షేమం

Published Wed, Apr 10 2019 8:50 AM | Last Updated on Wed, Apr 10 2019 8:51 AM

YS Avinash Reddy Election Campaign In Kadapa Constituency - Sakshi

వేంపల్లె రోడ్‌షోలో మాట్లాడుతున్న కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి 

సాక్షి, వేంపల్లె :  వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లెలో ఐటీఐ వద్ద నుంచి పట్టణ పురవీధులగుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా చంద్రబాబు ఏవిధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా విస్మరించారన్నారు. కేవలం అవినీతి, దౌర్జన్యాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలను వెనకేసుకున్నారే తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీలేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అర్హులైన పేదలందరికి సంక్షేమ ఫలాలు అందించడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నను సీఎం చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు.

ఏడాదిపాటు పాదయాత్ర చేసిన జగనన్న పేదల కష్టాలను చూసి చలించిపోయారన్నారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే నవరత్నాల పథకాలన్నారు. ఆయన తన మేనిఫెస్టోను ఉగాది రోజున ప్రకటించారని తెలిపారు. ఆయన ప్రకటించిన పథకాల వల్ల  రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్నికల సమయంలో బాబు మాటలు నమ్మితే మనం నట్టేట మునిగినట్లేనన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి అరచేతిలో వైకుంఠం చూపి తర్వాత అట్టడుగుకు తొక్కివేసే రకమని ఎద్దేవా చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో రాష్ట్రంలో సంక్షేమం ఫలాలు అందరికీ అందాయని, అభివృద్ధి జరిగిందన్నారు. పేదలకు పక్కాగృహాలు, ట్రిపుల్‌ ఐటీలు, పరిశ్రమలు, బైపాస్‌ రోడ్లు, పాలిటెక్నిక్‌ కళాశాల, జెఎన్‌టీయూ కళాశాల, ముస్లిం, మైనార్టీలకు కమ్యూనిటీ హాలు, టీటీడీ కళ్యాణ మండపం, ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌ వంటివి వైఎస్సార్‌ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు.

అదేవిధంగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే నవరత్న పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎన్నికలలో ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ నాయకులు బి.ప్రతాప్‌రెడ్డి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్‌ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్‌వల్లి, మాజీ ఎంపీపీ కొండయ్య, సొసైటీ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, మాజీ సర్పంచ్‌ సురేష్, మైనార్టీ కన్వీనర్‌ మునీర్‌లతోపాటు వైఎస్సార్‌సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement