జగన్ అరెస్టును నిరసిస్తూ ట్రై సైకిల్ యాత్ర
Published Mon, Sep 23 2013 12:26 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
ధవళేశ్వరం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ట్రై సైకిల్‌పై వెళ్లి తిరిగి ఇచ్చాపురం యాత్రగా వెళుతున్న శ్రీకాకుళం జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శి నెయ్యల ప్రసాద్‌కు ఆదివారం ధవళేశ్వరంలో పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తనది శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామమని తెలిపారు. తాను స్టోన్‌క్రషర్ వర్క్స్‌లో పని చేస్తున్నానన్నారు. ఇచ్ఛాపురం నుంచి సుమారు నెల్లాళ్లు ప్రయాణించి ఇడుపులపాయకు చేరుకున్నానని వివరించారు. అక్కడ వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించినట్టు ప్రసాద్ తెలిపారు.
యాత్ర మధ్యలో తిరుపతిలో జగన్ సోదరి షర్మిలను కలుసుకున్నానన్నారు. తిరిగి యాత్ర గా ఇచ్చాపురం వెళుతున్నానని ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 2600 కిలోమీటర్లు ప్రయాణించినట్టు ఆయన తెలిపారు. కుట్రపురితంగా జగన్‌ను జైలులో నిర్బంధించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రసాద్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వారే కుట్రదారులకు బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు తలారి వరప్రసాద్ మాట్లాడుతూ వికలాంగుడైనప్పటికి జగనన్నపై ఉన్న అభిమానంతో ఇన్ని వేల కిలోమీటర్లు యాత్ర చేయడం అభినందనీయమన్నారు. ప్రసాద్‌కు వైఎస్సార్ సీపీ నాయకులు కొంత ఆర్థికసాయాన్ని అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలి దేవకుమార్, కేవీ రావుకొత్తపల్లి రాజు, అమీద్, రబ్బానీ, బాలిబోయిన రమణ, గోసాల రాంబాబు, తలారి వీర్రాజు, గెడ్డం అభిమన్యు, మెండు రాంబాబు, విప్పర్తి విజయకుమార్, రేలంగి ఉమ, జెట్టి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement