
కలసికట్టుగా పోరాడుదాం
‘చంద్రబాబు హామీలు నమ్మి జనం ఓట్లు వేశారు. ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టాక ఆయన హామీలు మరచిపోయారు. అనంతపురం జిల్లాలో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారంటే.. తొలుత ఆయన నమ్మలేదు. ఆధారాలతో అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే ఒప్పుకున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందేదాక కలసి కట్టుగా పోరాడుదాం. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేద్దాం. నేనూ ఆ ధర్నాలో పాల్గొంటా’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి : ప్రతి పల్లెలోనూ ఆత్మీయ స్వాగతం.. జగన్ రాకతో ప్రతి రైతు కుటుంబంలోనూ ధైర్యం.. జగన్ కనిపించగానే అంతులేని ఆనందంతో ఈలలు, కేకలతో హోరెత్తించిన యువకులు.. మంగళహారతులు ఇచ్చి, దిష్టి తీస్తూ.. విజయ తిలకం దిద్దుతూ దీవించిన మహిళలు.. వెరసి రైతు భరోసా యాత్ర నాలుగో రోజు బుధవారం దిగ్విజయంగా సాగింది. బుధవారం ఉదయం పామిడిలో వీరాంజనేయులు గెస్ట్‌హౌస్ నుంచి యాత్ర మొదలైంది.
పెన్నప్పగుడికి చేరుకుని శంకర్ అనే రైతు పొలంలోకి వెళ్లి ధాన్యాన్ని పరిశీలించి, దిగుబడిపై జగన్ ఆరా తీశారు. సొరకాయలపేట మీదుగా ఎద్దులపల్లికి చేరుకున్నారు. ఎద్దులపల్లి పొలాల్లోని మహిళలు జగన్ కాన్వాయ్ కనిపించగానే పరిగెత్తుతూ రోడ్డుపైకి వచ్చారు. జగన్‌ను చూసి సంబరపడిపోయారు. డ్వాక్రా రుణ మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని జగన్‌కు వివరించారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న హరిజన వన్నూరప్ప(38) కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అక్కడి నుండి పాళ్యం గ్రామానికి చేరుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం అవలంభిస్తోన్న మోసపూరిత వైఖరి, రైతులు ఆత్మహత్యలు చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులు.. తాను రైతు భరోసా యాత్ర చేపట్టేందుకు కారణాలను ప్రజలకు వివరించారు. మోసం చేసి సీఎం పీఠం దక్కించుకున్న చంద్రబాబుపై కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. తర్వాత రామగిరి, ఎగువతాండా, దిబ్బసానిపల్లి మీదుగా కట్టకింద పల్లెకు చేరుకున్నారు. ఇక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి అనుంపల్లికి చేరుకున్నారు.
అనుంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఓబన్న కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు అత్తార్‌చాంద్‌బాషా, వై.విశ్వేశ్వరరెడ్డి, శింగనమల కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ సీనియర్ నా యకుడు చవ్వా రాజశేఖరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, బోయ తిప్పేస్వామి, పార్టీ నేత మీసాల రంగన్న, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, జిల్లా కార్యదర్శి కృష్ణవేణి, ట్రేడ్ యూనియన్, రైతు విభాగం, సేవాదల్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, వెంకట చౌదరి, మిద్దె భాస్కర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, పీ.బాలకృష్ణారెడ్డి తాడిపత్రి రమేష్‌రెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
40 బస్తాలయ్యేది.. 11 బస్తాలయ్యాయన్నా..
పామిడి మండలం పెన్నప్పగుడి సమీపంలోని పొలంలో వరి నూర్పిళ్లు చేస్తున్న రైతు పొలంలోకి జగన్ వెళ్లి పంటసాగు, గిట్టుబాటుపై ఆరా తీశారు.
జగన్: ఏం పేరన్నా?
రైతు: శంకరయ్య సార్
జగన్: ఎన్ని మూటలు పండినాయన్నా?
శంకరయ్య: సార్.. ఎకరాకు 40 మూటలయ్యేవి. ఈసారి 11 మూటలే అయినాయి. నీళ్లు లేక పంట పూర్తిగా నష్టపోయాం. హెచ్చెల్సీ నీళ్లన్నీ తాడిపత్రికి పంపించారు. అప్పుడు పంట పాలుపోసుకునే దశలో ఉంది. నీళ్లు లేకపోవడంతో పంట తాలు పడింది. దీంతో 11 మూటలే అయినాయిసార్..
జగన్: చూస్తుంటే తాలు దండిగా ఉందన్నా.. పంటపాలు పోసుకునే దశలో నీళ్లొచ్చి ఉంటే బాగా పండేది. ఏం చేద్దాం. ఈ ప్రభుత్వం రైతులకు నీళ్లు కూడా ఇవ్వదు. ధైర్యంగా ఉండు. మంచి రోజులు వస్తాయి.
నేటి రైతు భరోసా యాత్ర ఇలా..
‘రైతు భరోసా యాత్ర’ ఐదో రోజు వివరాలను పోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ వెల్లడించారు. గురువారం ఉదయం పామిడి వీరాంజనేయులు గెస్ట్‌హౌస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. పీ కొండాపురంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కొండూరు శివారెడ్డి (46) కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. ఆ తర్వాత రామరాజుపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు వెన్నెపూసల పుల్లారెడ్డి (64) కుటుంబాన్ని పరామర్శించనున్నారు.