ఒక్క రూపాయీ ఇవ్వలేదు | Not given even single rupee:ys jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయీ ఇవ్వలేదు

Published Mon, Jan 11 2016 2:43 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

ఒక్క రూపాయీ ఇవ్వలేదు - Sakshi

ఒక్క రూపాయీ ఇవ్వలేదు

♦ ఆత్మహత్యల పరిహారంపైనా చంద్రబాబు మోసం 
♦ రైతు భరోసా యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
 
 (రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
 ‘‘రైతులు చనిపోతే పరిహారంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల ఇళ్లన్నీ తిరుగుతున్నా.  ఈ జిల్లాలో దాదాపు 100 మందికి పైగా చనిపోయిన పరిస్థితి. ఆ ఇళ్లకు పోయినపుడు అందరూ అన్నా మాకు ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదని చెబుతూ గొల్లుమంటున్నారు. చంద్రబాబు అబద్ధాలు చెబుతూ.. మోసం చేస్తూ ఏ స్థాయికి వెళ్లిపోయాడో తెలుసుకునేందుకు ఇదో నిదర్శనం’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తర్వాత నెరవేర్చ లేదని జగన్ వివరించారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర ఐదోరోజైన ఆదివారం నాడు రాప్తాడు నియోజకవర్గంలోని బండమీదపల్లిలో రైతులు, డ్వాక్రా మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు.  జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

 హామీలు అటకెక్కించినందునే...
 ‘‘రైతు భరోసా యాత్ర సందర్భంగా ఇక్కడకు వచ్చాను. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలేమిటి? పదవి చేపట్టిన తర్వాత ఆయన చేస్తున్నదేమిటి? అనే అంశాలపై చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ ఈ యాత్ర చేస్తున్నా.  రైతుల కష్టాలపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీశా. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మీరు పక్కన పెట్టినందువల్ల రైతులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రైతులే కాదు, చేనేతలు, పేదలు అందరూ దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. వారి గురించి ఆలోచించండి అని చంద్రబాబును అడిగితే... లేదు లేదు.. రైతులందరూ సుఖసంతోషాలతో బతుకుతున్నారు అని ఆయన చెప్పారు. నాకు ఆశ్చర్యమేసింది. నిజంగా ఒక మనిషి అబద్ధ్దాలు చెబుతూ.. మోసం చేస్తూ ఏ స్థాయికి వెళ్లిపోయాడంటే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆ మనిషికి కనిపించడం లేదు.

 అంతా మోసం..మోసం..మోసం..
 ఎన్నికల ముందు రైతులతో, చేనేతలతో, చదువుకుంటున్న పిల్లలతో, అవ్వాతాతలతో, పేదలతో పని ఉంది కాబట్టి చంద్రబాబు అనేక హామీలు ఇచ్చాడు. అనాడు ఊరూరా ఫ్లెక్సీలు పెట్టారు. అవి కనిపిస్తాయో లేదోనని వాటికి లైట్లు పెట్టారు. గ్రామాలలో గోడలన్నిటిమీదా పెద్దపెద్ద అక్షరాలతో రాతలు రాసేవారు.. ఇంటికి వెళ్లి టీవీలు ఆన్ చేయగానే ప్రకటనలతో ఊదరగొట్టేవారు. చంద్రబాబు ఊరూరా తిరిగి మైకు పట్టుకుని మాట్లాడిన మాటలేమిటంటే.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలి అన్నారు.. రైతుల రుణాలన్నీ బేషరతుగా, పూర్తిగా మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు.. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు... గుడిసెలు లేని రాష్ర్టం కావాలంటే.. అందరికీ కాంక్రీటు ఇళ్లు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు.. బాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాలనూ మోసం చేశారు. చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే.. మోసం.. మోసం.. మోసం..

 మూడోవంతు వడ్డీకీ చాలని మాఫీ నిధులు
 రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ అన్నారు.. రైతులను మోసం చేశారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రైతు రుణాలు రూ. 87,612 కోట్లు ఉన్నాయి. బాబు రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకులకు కట్టవద్దని చెప్పాడు. దాంతో రైతులు ఆ రుణాలు కట్టలేదు. అప్పటి వరకు రైతులకు పావలా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇవాళ అపరాధ వడ్డీ 14శాతం బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. రైతుల రుణాలపై వడ్డీ ఈ 20 నెలల్లో రూ.20 వేల కోట్లు అయ్యింది. బ్యాంకులు రైతుల ముక్కుపిండి మరీ రుణాలను, వడ్డీని వసూలు చేస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం రుణమాఫీ జరిగిపోయిందని చెబుతున్నాడు.

రుణమాఫీ జరిగిందా అని అడుగుతున్నా.. (కాలేదంటూ సభికులు రెండు చేతులు పెకైత్తి అటూ ఇటూ ఊపుతూ చెప్పారు) రెండేళ్లలో రైతు రుణమాఫీకి చంద్రబాబు ఇచ్చింది రూ.7,300 కోట్లు. రైతు రుణాలపై వడ్డీలే రూ.20వేల కోట్లు ఉంటే బాబు ఇచ్చిన రూ.7,300 కోట్లు వడ్డీలో మూడోవంతుకు కూడా సరిపోదని అర్థం కావడం లేదూ..? రైతులనే కాదు డ్వాక్రా అక్కచెల్లెమ్మలను కూడా బాబు మోసం చేశాడు. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ అన్నాడు. మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని అక్కచెల్లెమ్మలను అడుగుతున్నా... (లేదని సభలో ఉన్న మహిళలంతా ముక్త కంఠంతో చెప్పారు.) బాబొస్తేనే జాబొస్తుం దని ఆరోజు రాతలు రాశారు.

ఇంటింటికీ వెళ్లి పాంప్లేట్లు పంచారు. ఒకవేళ ఉద్యోగమివ్వలేకపోతే ప్రతి ఇంటికీ రూ.రెండువేల  నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. జాబొచ్చిందా అని అడుగుతున్నా.. (లేదని యువకులంతా పెద్ద పెట్టున అరిచారు..) మరి  నిరుద్యోగ భృతి వచ్చిందా అని అడుగుతున్నా... (లేదు లేదని సమాధానం వచ్చింది). బాబు ముఖ్యమంత్రి అయితే పేదలందరికీ కాంక్రీటు ఇళ్లు కట్టిస్తానన్నారు. ఒక్క ఇల్లన్నా ఇచ్చాడా అని అడుగుతున్నా... (లేదని అంద రూ గట్టిగా చెప్పా రు.) అందరికీ పెన్షన్లు ఇస్తానన్నారు. ఇవాళ అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు కూడా ఎలా కత్తిరించాలా అన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. పేదలకు బియ్యం కోటా కూడా ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తున్నారు.

 కరువు మండలాలపైనా కపట నాటకాలు
 ‘ ఈ ఏడాది కరువొచ్చింది. తమ ప్రభుత్వం రాగానే ప్రతి రైతునూ ఆదుకుంటామని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి రూ. 1,692 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఎక్కడకు పోయిందని చంద్రబాబును నిలదీయండి. కేంద్రం  ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చింది. ఈయన మాత్రం రాష్ర్టం ఇవ్వాల్సింది కలిపి రైతులకు ఇవ్వకుండా దాన్ని వేరే పనులకు వాడుకున్నారు. రైతుల కళ్లలో మట్టికొట్టారు. 2014-15కు సంబంధించి రూ.736 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు  రూ.284 కోట్లు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నారు.  కరువుతో అల్లాడిపోయాం.

కరువు మండలాలు వెంటనే ప్రకటించాల్సిన చంద్రబాబు తాత్సారం చేశాడు. 163 మండలాలను కరువు మండలాలుగా ఎప్పుడు ప్రకటించాడంటే.. నెల్లూరు జిల్లాను అకాల వర్షాలు, వరదలు ముంచెత్తినపుడు. వరదలొచ్చిన తర్వాత కరువు మండలాలు ప్రకటించిన సీఎం దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కరే. కరువు మండలాల గురించి ముందే లెక్కలు వేసి నివేదికలు కేంద్రానికి పంపి ఉంటే  నిధులు వచ్చేవి. కేంద్రం ఒకవేళ నిధులు పంపిస్తే 50శాతం నిధులు తాను పెట్టుకుని రైతులకు పంపిణీ చేయాలి కాబట్టి కరువు మండలాలను ప్రకటించకుండా తాత్సారం చేశారు.’ అని జగన్ అన్నారు.

 రెండు కుటుంబాలకు పరామర్శ
 రైతు-చేనేత భరోసా యాత్రలో భాగంగా ఐదోరోజు  జగన్ రాప్తాడు నియోజకవర్గంలోని ఉప్పరపల్లి, ఎర్రగుంటలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు మారుతీప్రసాద్, నారాయణరెడ్డి కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
 
 ఉపాధ్యాయులకు అండగా ఉంటా
 అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులకు అండగా ఉంటానని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం అనంతపురంలోని ఆర్డీటీ అతిథిగృహంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) నాయకులు.. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌ను కలిసి ఉపాధ్యాయ రంగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. జగన్ స్పందిస్తూ...పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు అండగా ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని హామీ ఇచ్చారు.
 
 రాయలసీమకు నీళ్లిచ్చే ముఖమేనా?
 శ్రీశైలం నీళ్లన్నీ రాయలసీమకే ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు ఇవాళ పేపర్లలో కనిపించింది. నాకు ఆశ్చర్యమనిపించింది. ఇదే చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు పోతిరెడ్డిపాడు కట్టాలన్న ఆలోచన కూడా చేయని దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు. పోతిరెడ్డిపాడు కట్టింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అని గర్వంగా చెప్పుకుంటాం. రాయలసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉండాలి. కరెంటుకోసమని చెప్పి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీశైలం నీటిమట్టాన్ని 790 అడుగులకు తీసుకొచ్చారు. 854 అడుగుల నీటిమట్టం లేకపోతే రాయలసీమకు నీళ్లు వెళ్లవని తెలిసినా ఎందుకు నోరు మెదపలేదని చంద్రబాబును అడుగుతున్నా. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు. ఇటువంటి వ్యక్తి రాయలసీమకు నీళ్లిస్తానని చెబుతున్నాడు.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement