
ధైర్యంగా ఉండండి..
- రైతు కొండూరు శివారెడ్డి కుటుంబంతో జగన్
పామిడి: ‘కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా అందరం కలసికట్టుగా పోరాడదాం. మేమంతా అండగా ఉంటాం’ అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డి.. పామిడి మండలం పి.కొండాపురంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కొండూరు శివారెడ్డి, రామరాజుపల్లికి చెందిన రైతు వి.పుల్లారెడ్డి (64) కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఆయన గురువారం రెండు కుటుంబాల వారిని వేర్వేరుగా పరామర్శించారు.
ఈ సందర్భంగా శివారెడ్డి భార్య రంగమ్మతో మాట్లాడి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఆరా తీశారు. ఎంమేర అప్పులు పాలయ్యారు. వారి పిల్లలు ఏం చదువుతున్నారు అనే విషయాన్ని తెలుసుకొని రంగమ్మ చిన్న కుమార్తె స్వాతి చదువుకు సాయమందించాలని స్థానిక నేతకు సూచించారు.అదే విధంగా పుల్లారెడ్డి కుటుంబీకులతో మాట్లాడుతూ వారి కుటుంబ స్థితి గతులను తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వ పరంగా సాయం అందిందా లేదా అని ఆరా తీశారు.
పుల్లారెడ్డి కుమారుడు లక్ష్మి రెడ్డి తమ స్థితి గతులను తెలియజేస్తూ... మూడేళ్లుగా వర్షాల్లేక పంటలు పండక ఎకరాకు ఒక క్వింటా దిగుబడి రావడం గగనమైందని తెలిపాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి చేకూరలేదని చెప్పాడు. వారి సమస్యను విన్న జగన్‌మోహన్ రెడ్డి రైతుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని భరోసా ఇచ్చారు. అంతా ధైర్యంగా ఉండాలని, కలసి కట్టుగా సమస్యలను ఎదుర్కొందామని చెప్పారు.