నేనున్నానని..! | ys jagan Consolation to the victims of the explosion of fireworks | Sakshi
Sakshi News home page

నేనున్నానని..!

Published Thu, Apr 2 2015 2:16 AM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM

నేనున్నానని..! - Sakshi

నేనున్నానని..!

బాణసంచా పేలుడు బాధితులకు జగన్ పరామర్శ
ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యంపై మండిపాటు
సర్కార్ మెడలు వంచైనా న్యాయం చేస్తామని భరోసా
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున చెల్లించాలని డిమాండ్
క్షతగాత్రులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్

 
బాణసంచా పేలుడు బాధితులకు ఓదార్పు... నేనున్నానని సాంత్వన...బాధితులను ఆదుకోవడంపై ప్రభుత్వ వైఫల్యంపై ధ్వజం... పాతరపున సాయం చేస్తామని భరోసా... పూర్తి న్యాయం జరిగేవరకు పోరాడతామని ప్రతిన...ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పాయకారావుపేట, గోకులపాడులలో బుధవారం పర్యటన సంక్షిప్త చిత్రం. గోకులపాడు బాణసంచా పేలుడు ప్రమాద బాధితులను వై.ఎస్.జగన్ జిల్లాలో బుధవారం పర్యటించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నేరుగా పాయకరావుపేట చేరుకున్నారు. పాయకరావుపేట, గోకులపాడులలో పేలుడు ఘటన మృతులు, క్షతగాత్రుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. గోకులపాడులో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అడుగడుగునా బాధిత కుటుంబాలతో మమేకం అవుతూ జగన్ పర్యటన ఆద్యంతం ఆప్తజనసంద్రంగా సాగింది.
                         
 విశాఖపట్నం/నక్కపల్లి :  బాణసంచా పేలుడు మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల ఆవేదన చూసి జగన్ చలించిపోయారు. తమ కోసం వచ్చిన జగన్‌ను చూసి పేలుడు బాధితు కుటుంబాలు కన్నీటిపర్యంతమయ్యాయి. పాయకరావుపేటలోని మృతుడు భూపతి సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన భార్య అప్పలనర్సు, కుమార్తె భవాని, కుమారుడు శ్రీనులను ఓదార్చారు. ‘ప్రమాదం ఎలా జరిగిందమ్మా’ అని జగన్ అడిగే సరికి కన్నీటిపర్యంతమై తమ బాధ వెళ్లగక్కారు. ‘ పండ్ల వ్యాపారం కలసి రాలేదని పొట్ట కూటి కోసం పదేళ్లుగా బాణాసంచా పనిలోకి వెళ్లారు. వేతనం కొంత ఎక్కువ వస్తుందని ఆశపడ్డారు. కానీ అదే ప్రాణాల మీదకు తెచ్చింది. దిక్కులేని వాళ్లమైపోయాం’అని గొల్లుమన్నారు. ‘కూతురు పెళ్లి కుదిరింది. డబ్బులు సర్దుబాటు చేసుకుని ముహుర్తాలు పెట్టించుకోవాలనకున్నాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది’అని వాపోయారు. ఆ కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయిన జగన్ వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున ఏమైనా సాయం అందిందా అని ప్రశ్నించారు.

రూ.2లక్షలే ఇచ్చారని అప్పలనర్సు చెప్పారు. దీనిపై స్పందించిన జగన్ పార్టీ తరపున ఆదుకోవడమే కాదు ప్రభుత్వం నుంచి పూర్తి పరిహారం రూ.5లక్షలు అందేలా పోరాడతానని భరోసా ఇచ్చారు. అక్కడే  ఉన్న బాణాసంచా పేలుడు ఘటనలో గాయపడి విశాఖపట్నంలో చికిత్స పొందుతున్న  బంగారి అప్పారావు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. అప్పారావు పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు.  ఇతని పరిస్దితి ఎలా ఉందని అడిగారు. ‘కాలు బాగా దెబ్బతింది. కాలు తీసేయాలని డాక్టర్లు చెబుతున్నారు. మాకు ఏం చేయాలో తెలీడం లేదు’అని వాపోయారు. దీనిపై స్పందించిన జగన్ ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా అని అడిగారు. తమకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని ఆ కుటుంబ సభ్యులు చెప్పడంతో జగన్ నిర్ఘాంతపోయారు.

అనంతరం వై.ఎస్.జగన్ గోకులపాడు చేరుకుని మృతులు లింగంపల్లి శేషమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె భర్త  భర్త అర్జబాబు, ఇద్దరు కుమారులను పరామర్శించారు. అక్కడేఉన్న సమ్మంగి రమణ, కడాది దుర్గాప్రసాద్, భూపతి లోవరాజుకుటుంబీకులను ఓదార్చారు.  లోవరాజు ముగ్గురు చిన్నపిల్లలను చూసి జగన్ చలించిపోయారు. పాయకరావుపేట నుంచి దార్లపూడివచ్చి బాణాసంచాతయారీ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని ప్రమాదంలోఇంటిపెద్దదిక్కు లేకుండా పోయాడని లోవరాజు బార్యబోరున విలిపించింది.  వారి కుటుంబ పరిస్దితి తెలుసుకుని అధైర్యపడొద్దని ప్రభుత్వ మెడలు వంచి  మీకు సరైన న్యాయం జరిగేలా చూస్తానని హమీ ఇచ్చారు. పార్టీకూడా అండగా నిలుస్తుందన్నారు. విశాఖపట్నం ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న క్షతగాత్రులు కశిరెడ్డి విశ్వనాధం, నానేపల్లిదుర్గ శెలంశెట్టి లక్ష్మి, కశిరెడ్డి కృష్ణ కుటుంబీకులను కూడా ఓదార్చారు. అనంతరం పేలుడు ప్రమాదంలో మృతిచెందిన నూతి సత్యవతి ఇంటికి వెళ్లి ఆమెభర్త గోవిందు , ఇద్దరు చిన్నపిల్లలను పరామర్శించారు.  అనంతరం బాణాసంచా పేలుడు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వంపై ధ్వజం

బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వంపై వై.ఎస్.జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ విధాన వైఫల్యాలను ఒక్కొక్కటికిగా ఎండగట్టారు. ప్రమాదంలో మృతులకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీలో అలా చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం రూ.2లక్షల చొప్పునే ఎందుకు ఇచ్చి చేతులు దులుపుకుందని నిలదీశారు. ఇక క్షతగాత్రుల కుటుంబాలకు రూపాయి కూడా సాయం చేయకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. కుటుంబ పెద్ద ఆసుపత్రిలో ఉంటే ఆ కుటుంబ పోషణ ఎలా అని ప్రభుత్వం ఆలోచించకపోవడమేమిటని విస్తుపోయారు. పబ్లిసిటీ కోసం ఎంతైనా ఖర్చుచేసే ప్రభుత్వానికి బాధితులకు మాత్రం సాయం చేయడానికి చేతులు రావడం లేదని ధ్వజమెత్తారు.
 
బాధితులకు భరోసా...

కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే జగన్ పరిమితం కాలేదు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తాను, పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ తరపున సాయం చేస్తామని చెప్పారు. ఐదారేళ్లుగా బాధితులకు పార్టీ తరపున సాయం చేస్తునే ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. తూర్పుగోదావరి జిల్లాలో గతంలో పేలుడు సంభవిస్తే తానే ముందు వెళ్లిన విషయాన్ని ఉదహరించారు. గోకులపాడు కూడా సీఎం రాలేదని... తానే వచ్చాననే విషయాన్ని గుర్తుచేశారు. ఏ ప్రమాదం జరిగినా... ఎవ్వరు బాధల్లో ఉన్నా ముందుండేది జగనే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గోకులపాడు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు తగిన పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం మెడలు వంచుతామని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రసంగం రికార్డులను తెప్పించి చంద్రబాబు, కలెక్టర్లకు లేఖలు రాస్తానని ప్రకటించారు.

బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తాను, పార్టీ పోరాడతామని వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.  వై.ఎస్.జగన్ సాయంత్రం హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఆయన పర్యటనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, బూడి ముత్యాల నాయుడు, కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, నియోజకవర్గాల సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, తిప్పల నాగిరెడ్డి, వంశృకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, అదీప్‌రాజ్,  సీఈజీ సభ్యుడు వీసం రామకృష్ణ, జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు,  పార్టీ నేతలు బొడ్డేడ ప్రసాద్, సత్తి రామకృష్ణారెడ్డి, అల్లాడ శివకుమార్, బోలిశెట్టిగోవిందు, ధనిశెట్టి బాబూరావు, కొణతాల శ్రీనివాసరావు, గొర్ల బాబూరావు, జోగారావు తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement