వీవీ వినాయక్ తల్లికి కన్నీటి వీడ్కోలు
చాగల్లు :ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తల్లి గండ్రోతు నాగరత్నం అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం పూర్తయ్యాయి. చాగల్లు శివారులోని వారి సొంత వ్యవసాయ భూమిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలను నిర్వహించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ ఆసుపత్రి నుంచి నాగరత్నం మృతదేహాన్ని అంబులెన్స్‌లో చాగల్లులోని స్వగృహానికి తీసుకువచ్చారు. తల్లి మృతదేహాన్ని చూసి వీవీ వినాయక్, సురేంద్ర కుమార్, విజయ్‌లతో పాటు కుమార్తెలు బోరున విలపించారు. చిన్ననాటి నుంచి తమను ఎంతో అల్లారుముద్దుగా పెంచిన తల్లిని కోల్పోయానంటూ వినాయక్ విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. నాగరత్నం మృతదేహాన్ని ఇంటి నుంచి వెంకటకృష్ణా థియేటర్ మీదుగా కాపులగుడి వీధి వద్ద నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్లి మీనానగరంలోని సొంత పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, గ్రామస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
నివాళులర్పించిన ప్రముఖులు
వినాయక్ తల్లి నాగరత్నం మృతి పట్ల వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. బుధవారం ఉదయం వినాయక్‌తో ఫోన్‌లో మాట్లాడి విచారం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు నాగరత్నం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని), ఆలమూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరాటం రాంబాబు, జక్కంపూడి చిన్ని, సినీ నిర్మాతలు బెల్లంకొండ సురేష్, వీవీ దానయ్య, బుద్దాని కాశీవిశ్వనాథ్, మల్లిడి సత్యనారాయణ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సినీ దర్శకులు మెహర్ రమేష్, సంతోష్ శ్రీనివాస్, చిన్ని కృష్ణ, మాటల రచయితలు ఆకుల శివ, రాజేంద్రప్రసాద్, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అలంకార్ ప్రసాద్, గీతా ఫిలింస్ మేనేజర్ రామకృష్ణ, ఉషా పిక్చర్స్ మేనేజర్ సుదర్శన్, జనసేన పార్టీ నాయకులు బుద్దాని గణపతి, ప్రముఖ వ్యాపార వెత్తలు తుమ్మిడి రామ్‌కుమార్, విజయ్‌కుమార్, తహసిల్దార్ ఎం.మెరికమ్మ తదితరులు నివాళులర్పించారు.
నాగరత్నం మృతికి కొత్తపల్లి సంతాపం
నరసాపురం అర్బన్ : సినీ దర్శకుడు వీవీ వినాయక్ తల్లి నాగరత్నం మృతిపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి కొత్తపల్లి సుబ్బారాయుడు సంతాపం వ్యక్తం చేశారు. తల్లి మృతి లోటు తీర్చలేనిదని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, నాయకులు పాలంకి ప్రసాద్, దాసరి శ్రీనివాస్, చెన్నా రమేష్, గుగ్గిలపు మురళి తదితరులు సంతాపం తెలిపారు.