
సాక్షి, అనంతపురం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. శనివారం వైఎస్ జగన్ 36వ రోజా పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ బాధలు రాజన్న బిడ్డకు చెప్పుకున్నారు.
మైనారిటీ నాయకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, న్యాయవాదులు ఆయనను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నా..అంటూ కాంట్రాక్ట్ లెక్చరర్స్, మైనారిటీలు, న్యాయవాదులు వైఎస్ జగన్‌కు వివరించారు. అలాగే... బడన్నపల్లిలో ఇటీవల హత్యకు గురైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెన్నారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. పాదయాత్రలో భాగంగా ధర్మవరం మండలం బడన్నపల్లెకు చేరుకున్న ఆయన..చెన్నారెడ్డి ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
చంద్రబాబు తీరు దారుణం: కాంట్రాక్ట్ లెక్చరర్స్
కాంట్రాక్ట్ లెక్చరర్స్‌పై చంద్రబాబు తీరు దారుణంగా ఉందని ఎస్‌కే యూనివర్సిటీ అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రీనింగ్ టెస్ట్ పేరుతో తమకు అన్యాయం చేస్తున్నారని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌కే యూనివర్సిటీకి చెందిన కాంట్రాక్టు లెక్చరర్స్ కలిశారు. అన్ని అర్హతలు ఉన్న మమ్మల్ని రోడ్డున పడేశారని మండిపడ్డారు. చంద్రబాబు తీరును క్షమించే పరిస్థితి లేదు అన్నారు. 16 ఏళ్లుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న మమ్మల్ని గుర్తించకపోవడం దారుణమన్నారు. మమ్మల్ని రెగ్యులరైజ్‌చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ ఆమోదం తెలిపిందని, అయితే చంద్రబాబు తమ కొంప ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ యూనివర్సిటీలో కూడా రెగ్యులర్ చేయాలని కోర్టు అనుమతించిందన్నారు. తాము కూడా హైకోర్టులో పోరాటం చేస్తున్నామని, చంద్రబాబుపై నమ్మకం లేదని కాంట్రాక్ట్ అధ్యాపకులు అన్నారు.
న్యాయవాదులకు చట్ట సభల్లో అవకాశం కల్పించాలి
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు న్యాయవాదులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో, చట్టసభల్లో తమకు అవకాశం కల్పించాలని వారు ప్రతిపక్ష నేతను కోరారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు ఇచ్చే స్టైఫండ్‌ను పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని వైఎస్ జగన్‌ను కోరారు.
26 నుంచి చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర
కాగా ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జనంతో మమేకమై సాగుతున్న వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. డిసెంబర్ 26 నుంచి చిత్తూరు జిల్లాలో 20 రోజుల పాటు సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. తిరుపతి పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రజాసంకల్పయాత్ర రూట్ మ్యాప్ ని ఖరారు చేసిన అనంతరం... తొమ్మిది రోజుల పాటు 260 కిలోమీటర్లు యాత్ర సాగుతుందని ఆయన తెలిపారు. తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, చంద్రగిరి, నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటారని తెలిపారు.