తూర్పుగోదావరి, కపిలేశ్వరపురం (మండపేట): తమ అభిమాన నేతను చూడాలి. కనులారా ఆయనను వీక్షించాలి. తమ ఆవేదనను ఆయనతో చెప్పుకోవాలి. ఆయనతో కలసి అడుగులు వేయాలి. కరచాలనం చేయాలి. వీలుంటే సెల్ఫీ దిగాలి. ఆయన ఆశీర్వాదం పొందాలి.. ఇలా ప్రతి ఒక్కరూ పాదయాత్రలో అనుకున్న వారే. ఆయన వస్తున్నారని తెలిస్తే చాలు.. దారులన్నీ జనగోదారులయ్యాయి. ఆయన పలకరింపే.. ఓ పులకరింపుగా భావించిన అభిమాన జనం ఆయన వెన్నంటే నడిచారు. ఏపీ ప్రతిపక్షనేత్ర, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ‘తూర్పు’లో చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చాలా మందికి మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. ఎప్పటికీ మరచిపోలేని అనుభూతిని కలిగించింది.
అపురూప చిత్రం..
యూఎస్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న పెద్దింటి కీర్తి తన కుటుంబ సభ్యులతో వచ్చి జగన్‌తో సెల్ఫీ దిగి సంబరపడింది. తన కవల చిన్నారులతో కలిసి జగనన్నతో సెల్ఫీ తీసుకున్నానంటూ వాడ్రేవుపల్లికి చెందిన గోగు సుష్మ సంతోషం వ్యక్తం చేసింది. ఆయన ఆప్యాయంగా పలకరించడంతో పులకరించిపోయింది. తమ అన్నదమ్ముల పిల్లలందరితో కలిసి సెల్ఫీ దిగామంటూ సంబరపడ్డారు కడలికి చెందిన భార్యాభర్తలు బత్తుల దుర్గాభవాని, నవీన్‌కుమార్. బంధువుల పిల్లలందరితో జగన్‌తో లంకల గన్నవరం వద్ద సెల్ఫీ దిగామని ఆయన ఎంతో ఓపికగా అందరితో సెల్ఫీదిగడం తనకెంతో ఆశ్చర్యమేసిందని లంకల గన్నవరానికి చెందిన ఎన్నాబత్తుల శాంతకుమారి సంతోషం వ్యక్తం చేశారు. గంటి పెద్దపూడికి చెందిన బీటెక్ చదువుతున్న అక్కచెల్లెల్లయిన వి.భవాని, అనూషలు సెల్ఫీ దిగి తమ కుటుంబ సభ్యులకు చూపిస్తూ సంబరపడ్డారు.
వైఎస్ కుటుంబంపై ప్రేమతో..
పేదలను అక్కున చేర్చుకున్న వైఎస్సార్ కుటుంబ సభ్యులపై కోనసీమ ప్రజలు అభిమానం చాటుకున్నారు. పాదయాత్ర దారైన జొన్నలంకలో వైఎస్ కుటుంబ సభ్యులతో ముద్రించిన ప్లెక్సీని అమర్చి స్వాగతం పలికారు. జగన్ తాతయ్య రాజారెడ్డి, దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మల బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో పాటు జగన్ చిన్ననాటి ఫోటోలు, ఇతర కుటుంబ సభ్యులు ఫ్లెక్సీలో ఉన్నాయి. పాదయాత్రికులను ఆ ఫ్లెక్సీ ఎంతగానో ఆకర్షించింది.
నాన్న నేమ్‌తో నా బిడ్డ వర్ధిల్లాలంటూ...
అభిమాన అన్నతో తమ పిల్లలకు నామకరణం చేయించుకున్నారు. కాకినాడకు చెందిన వనుం శ్రీదే వి, మురళీకృష్ణల బిడ్డకు పర్నిక అని జగన్ నామకరణం చేశారు. పలువురు చిన్నారులకు విజయలక్ష్మి, అని రాజశేఖర్ అని పేర్లు పెట్టారు. రాజోలుకు చెందిన కేఎన్ ప్రసాద్, జ్యోతి దంపతులకు వైఎస్సార్ కుటుంబమంటే వల్లమాలిన ప్రేమ. పాదయాత్రగా వచ్చిన జగన్ పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో కలిసి తమ కుమారుడు జయన్స్ రెడ్డిగా నామకరణం చేయించుకున్నారు. ప్రసాద్ బ్యాంకు ఉద్యోగి కాగా జ్యోతి పీహెచ్‌సీలో సెకండ్ ఏఎన్‌ఎంగా విధులను నిర్వహిస్తున్నారు. తన కుమారుడికి రాజశేఖర్‌రెడ్డి అని పేరు పెట్టించుకోవడం సంతోషంగా ఉందని ముంగండకు చెందిన దొమ్మేటి దుర్గారావు, దుర్గలు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఉచ్చులవారి పేటకు చెందిన నేతల రమేష్, జయశ్రీల కోరిక మేరకు తమ కుమారుడికి జగన్ అని పెట్టారు.
ప్రేమను తాకించు అన్నా..
సంప్రదాయబద్ధంగా జరుపుకొనే అన్న ప్రాసనను అమితంగా అభినందించే జగనన్నతో చేయించుకున్నారు పలువురు. కరకుదురులో ప్రణవ్‌కు జగనన్న అన్నప్రాసన చేయడంతో తల్లి చంద్రకళ సంతోషం వ్యక్తం చేసింది. ఆరు నెలల చిన్నారి చన్విక్‌రెడ్డికి జగన్ అన్నం ముట్టించడంతో తల్లి చిర్ల సత్యకుమారి పట్టలేనంత ఆనందాన్ని పొందారు.
దుష్ట శక్తుల దిష్టి తగలకూడదంటూ..
పాదయాత్రికుడికి దిష్టి తగలకూడదని, అంతా మంచే జరగాలని కోరుకుంటూ విరవాడలో అక్క చెల్లెమ్మలు అడబాల వరలక్ష్మి కుటుంబ సభ్యులు, ఊలపల్లిలో పంపన చంద్రకాంతం కుటుంబ సభ్యులు హారతి పట్టి జగన్‌నుఆశీర్వదించారు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ..
పాదయాత్రలో పలువురికి జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ముందుకు సాగారు. నాన్న పుట్టిన రోజునే పుట్టాడయ్యా అంటూ తన మనుమడు శ్రీరాజశేఖర్‌రెడ్డిని తీసుకొచ్చి జగన్‌కు చూపించారు దివిలికి చెందిన కేఎన్ సత్యనారాయణ. రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టుకున్నామంటూ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఊలపల్లిలో చిన్నారి అక్షయకు అక్షింతలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. పెద్దాడలో జగన్‌ను కలిసిన కె.దేవికి బర్త్‌డే విషెస్ చెప్పారు.
అన్న చేతులతో లాలన..
జగన్‌ను చూసేందుకు వచ్చిన అక్క చెల్లెమ్మలు తమ చిన్నారులను జగన్‌కు చూపించేవారు. వారిని ఎంతో ప్రేమగా జగన్ ఎత్తుకుని లాలించే వారు. పిఠాపురం అగ్రహారంలో ముప్పిడి బిందు కుటుంబ సభ్యులతో జగన్‌ను చూసేందుకు రాగా తన బిడ్డను జగన్ ఎత్తుకుని లాలించారు. నెల్లిపూడికి చెందిన వై.స్వాతి తన బిడ్డను ఆశీర్వదించమని జగన్‌ను కోరగా ఆ బిడ్డను ఎత్తుకుని జగన్ లాలించడంతో స్వామి అమితానందాన్ని పొందింది. తన బిడ్డను జగన్ ఎత్తుకుని లాలించారంటూ సంబరపడ్డారు ఊడిమూడికి చెందిన కప్పలరోజా సంబరపడింది.
అన్నచే అ, ఆలు దిద్దించారు..
పల్లిపాలేనికి చెందిన అక్షయ్‌కుమార్‌తో జగన్ అక్షరాలు దిద్దించారు. దీంతో తల్లి విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. కడలి గవళ్లపాలెం వద్ద తమ చిన్నారి నిమీషాకు అక్షరాభ్యాసం చేయించారు. బిసావరానికి చెందిన చెలులబోయిన శ్రీను సువర్ణ దంపతుల కోరిక సాకారమైందంటూ సంబరపడ్డారు. తన ఇద్దరి కుమార్తెలకు జగన్‌తో అక్షరాభ్యాసం చేయించడం సంతోషంగా ఉందంటూ గంటి పెదపూడికి చెందిన చిల్లి విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడు హర్షకు జగన్ చేతులమీదుగా అక్షరాబ్యాసం చేయించడం సంతోషంగా ఉందంటూ పశ్చిమగోదావరి జిల్లా దొంగరావిపాలేనికి చెందిన పమ్మి ప్రియాంక సంబరపడింది.
అన్నకు రక్షణగా రాఖీ..
అన్నకు రాఖీ కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు అక్క చెల్లెమ్మలు. పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ చదువుతున్న దేవీ వరలక్ష్మి, ప్రత్తిపాడు నియోజకవర్గంలో శివాని, స్నేహ, సంధ్య, రత్న, మహిత తదితరులు జగన్‌తో సెల్ఫీ తీసుకుని రాఖీ కట్టారు.
ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీ..
పాదయాత్రలో జనం జగనన్నతో ఆటోగ్రాఫ్ తీసుకుని సంబరపడ్డారు. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తాను ఐదేళ్ల తర్వాత ఆటూగ్రాఫ్ తీసుకున్నాంటూ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మేకా బయ్యపురెడ్డి సంబరపడ్డారు. కందులపాలేనికి చెందిన దిరిసాల రాజకుమార్ జగన్‌చే తన చొక్కాపై ఆటోగ్రాఫ్ పెట్టించుకుని సంబరపడ్డాడు. నగరంలో జగనన్నను కలిసి ఆటోగ్రాఫ్ అడగ్గానే ఇచ్చారని చిన్నారులు ముంగండ ఎలీష్‌కుమార్, లక్ష్మీ ప్రవల్లిక మురిసిపోయారు. విరవాడలో కోలా శివనాగబాల కుటుంబ సభ్యులతో వచ్చి జగన్ ఆటోగ్రాఫ్ తీసుకుంది. నెల్లిపూడికి చెందిన ఏనుగు స్వాతికి జగన్ ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో అమితానందాన్ని పొందింది.
నిండు గర్భిణులకు అన్న ఆశీర్వాదాలు..
పాదయాత్రగా వస్తున్న జగనన్న ఆశీర్వాదం కోసం ఎంతో మంది గర్భిణులు పాదయాత్రకు ఓపిక తీసుకుని వచ్చేవారు. ఎనిమిదినెలల గర్భవతిగా ఉన్న తనను జగనన్న ఆశీర్వదించారం టూ పెదపట్నంలంకకు చెందిన చెల్లుబోయిన రేవతి సంతోషం వ్యక్తం చేశారు. భర్తతో కలిసి 13 కిలోమీటట్లు బైక్‌పై ప్రయాణించి మొండెపులంకలో జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు.
ప్రేమానురాగాలు పంచిన వేళ...
జగనన్నను కట్టమూరు క్రాస్ వద్ద కలిసి సెల్ఫీ తీసుకున్నాక తన భర్తకు మీరంటే ఎంతో అభిమానమని ఒక్కసారి ఆయనతో ఫోన్‌లో మాట్లాడన్నా అని అడగడంతో వెంటనే ఫోన్ చేసి తన భర్తతో మాట్లాడారంటూ సంబరపడింది తునికి చెందిన యండమూరి సత్యప్రయదర్శిని. ఓదార్పు యాత్రకు వచ్చిన సమయంలో అన్నతో తీయించుకున్న ఫోటోను పాదయాత్రలో జగన్‌కు చూపింది వేగివారిపాలేనికి చెందిన విప్పర్తి హర్షిత. ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు తాను రెండో తరగతి చదువుతున్నాననీ, మళ్లీ అన్నను కలసి సెల్ఫీ తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. జగనన్న అంటే తనకు ఎంతో ఇష్టమంటూ కడలికి చెందిన చిన్నారులు రేణి సుభాష్, కేవిన్ సుభాష్ రితీష్ చంద్ర, దీప్తిరాయులు స్వయంగా తాము తయారు చేసిన జగన్ ఫొటో ఆల్బమ్‌ను చూపించారు. అచ్చంపేటలో చేతి రుమాలుపై జై జగన్, జై వైఎస్సార్ అని రంగు రంగుల దారాలతో తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి పెరుమళ్ల అనిత జగన్‌కు అందజేశారు. పిఠాపురంలో తల్లిదండ్రులతో వచ్చిన సాత్విక్ అనే చిన్నారి సైనిక దుస్తుల్లో విశేషంగా ఆకర్షించారు.
Comments
Please login to add a commentAdd a comment