పెన్షన్లకు కత్తెర అమానుషం | ys jagan fire on tdp government | Sakshi
Sakshi News home page

పెన్షన్లకు కత్తెర అమానుషం

Published Wed, Sep 24 2014 12:51 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

పెన్షన్లకు కత్తెర అమానుషం - Sakshi

పెన్షన్లకు కత్తెర అమానుషం

పేదల పొట్టకొట్టే చంద్రబాబు సర్కారు కుట్రలో భాగస్వాములు కావద్దు పెన్షన్ల పరిశీలన కమిటీలకు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ లేఖ
 
హైదరాబాద్: అర్హులైన వారి ఫించన్లను కత్తిరించేందుకు..పేదల పొట్టగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కత్తిదూయ టం అమానుషం, దుర్మార్గమని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రకరకాల ఆంక్షలు పెడుతూ అర్హులైన వారి పింఛన్లను తొలగించేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న కుట్రలో భాగస్వాములు కావద్దని.. పింఛన్ల పరిశీలన కోసం నియమించిన కమిటీల అధ్యక్షులు, సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి కుల , మత, వర్గాలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులందరికీ పింఛన్లు లభించేలా చూడాలని, పేదల పక్షాన నిలబడాలని వారిని కోరుతూ జగన్ మంగళవారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది...

‘పెన్షన్లకు కత్తెర అమానుషం.
ప్రభుత్వ ఎజెండా దుర్మార్గం.
పార్టీలకు అతీతంగా పేదల పక్షాన నిలబడండి..


ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పింఛన్లను ఏరి వేయడానికి ప్రభుత్వం తరఫున జరుగుతున్న కుట్రలో భాగస్వాములు కావద్దని పెన్షన్ల పరి శీలన కమిటీ అధ్యక్షులకు, సభ్యులకు ప్రతిపక్ష నాయకుడిగా, మహానేత తనయుడిగా, పేదల పక్షపాతిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు గ్రామగ్రామానా తిరుగుతూ రెండు వందల రూపాయల పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేస్తానని, రూ.500 పింఛన్‌ను 1,250 నుంచి రూ.1,500 చేస్తానని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా పింఛన్‌దార్ల మీద కక్షగట్టినట్లు, పగబట్టినట్లు ప్రవర్తిస్తూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేతన్నలూ, గీతన్నల పింఛన్లను కత్తిరించే కార్యక్రమం ప్రారంభించింది. నిన్నటి వరకూ పింఛన్లు అందుకున్న వృద్ధు లు, వికలాంగులు, వితంతువులు, నేతన్నలు, గీతన్నలు.. పింఛన్లు తొలగిస్తే ఇక వారంతా ఎలా బతుకుతారన్న ఆలోచన లేకుండా చంద్రబాబు ఖర్చు తగ్గించుకునే కార్యక్రమం ప్రాంభించారు. ఏపీలో 43,11,688 పింఛన్ల కోసం ఈ ఏడాది కేటాయింపు కనీసంగా 3,730 కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా చంద్రబాబు బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.1,338 కోట్లు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో ప్రస్తుతం 43,11,688 మంది పింఛన్లు తీసుకుంటున్నారు. అందులో...

 ► వృద్ధాప్య పింఛన్లు: 20,30,131 (వీరికి ప్రస్తు తం నెలకు రూ.200 ఇస్తుండగా అక్టోబర్ 2వ తేదీ నుంచి రూ.1,000 ఇవ్వాలి).

 ► వితంతు పింఛన్లు: 13,21,986 (వీరికి కూడా ప్రస్తుతం నెలకు రూ.200 ఇస్తుండగా అక్టోబర్ 2 నుంచి రూ.1,000 ఇవ్వాలి).

 ► వికలాంగుల పింఛన్లు: 5,36,837 (ప్రస్తుతం రూ.500 ఇస్తుండగా అక్టోబర్ 2 నుంచి రూ.1,500 ఇవ్వాలి).

 ► అభయహస్తం పింఛన్లు: 2,87,897 (ప్రస్తు తం రూ.500 ఇస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి వీరికి రూ.1,000 ఇవ్వాలి).

 ► ఇతర కేటగిరీ: దాదాపు 90 వేలు (వీటికి కూడా ప్రస్తుతం రూ.200 ఇస్తుంటే అక్టోబర్ 2 నుంచి రూ.1,000 ఇవ్వాల్సి ఉంటుంది).

 ► ఈ మొత్తం 42,11,688 మంది పింఛనుదారులకు ఇప్పటి వరకు నెలకు చెల్లిస్తున్న మొత్తం: రూ. 130 కోట్లు (అంటే - ఏప్రిల్ నుంచి ఆగ స్టు వరకు రూ.650 కోట్లు చెల్లించాలి.)

 ► సెప్టెంబర్ నుంచి (చంద్రబాబు చేసిన వాగ్దా నం మేరకు) 43,11,688 మంది పింఛనుదారులకు నెలకు రూ. 431 కోట్లు చెల్లించాలి. వీరిలో వికలాంగులకు పింఛన్ల కింద నెలకు రూ. 1,500 ఇవ్వాలి.

 ► ఈ లెక్కన మిగిలిన ఏడు నెలల్లో (ఏప్రిల్ వరకూ): నెలకు రూ. 440 కోట్లు చొప్పున 7 నెల లకు మొత్తం రూ. 3,080 కోట్లు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో సామాజిక పింఛన్లకు కేటాయించాల్సిన మొత్తం రూ.650 కోట్లు ప్లస్ రూ. 3,080 కోట్లు.మొత్తం 3,730 కోట్లు.

 ► కానీ బడ్జెట్‌లో కేటాయించింది: రూ 1,338 కోట్లు మాత్రమే.

 ► లోటు (తేడా): 2,400 కోట్ల రూపాయలు.

 ► అంటే ఈ రూ. 2,400 కోట్ల మేరకు సామాజిక పింఛన్లు క త్తిరించి, కొందరికి మాత్రమే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారని ఎవరికైనా అర్థం అవుతుం ది. అందుకే పేదలకు అన్యాయం చేసే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఎజెండాకు సహకరించకుండా అర్హులందరికీ పార్టీలకు, ప్రాం తాలకు, కుల మతాలకు అతీతంగా పింఛన్లు అందించేలా గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఉన్న నాయకులు, కమిటీ సభ్యులంతా మానవతా దృక్పథంతో ప్రవర్తిం చాలని.. ఈ కత్తెర కార్యక్రమానికి సహకరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

మహానేత సాచ్యురేషన్ విధానాన్ని అవలంభించారు...

మహానేత వైఎస్సార్ మరణం తరువాత, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో 7 లక్షల సామాజిక పింఛన్లకు పరిశీలనల పేరిట కోత పెట్టింది. నిజానికి మరో 15 లక్షల మంది సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. అర్హులందరికీ పింఛన్ అందించటానికి వీలుగా మహానేత సాచ్యురేషన్ (సంతృప్త స్థాయి) విధానాన్ని అవలంభించారు. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు వంటివి పరిగణనలోకి తీసుకోకుండా, అవసరం - అర్హత అనే ప్రాతిపదికలపై అందరికీ పింఛన్లు అందించారు. కాబట్టే వైఎస్సా ర్ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు 17 లక్షలు మాత్రమే ఉన్న పింఛన్లకు అదనంగా 55 లక్షల కొత్త పింఛన్లు అందించారు. పింఛన్ మొత్తాన్ని రూ.75 నుంచి రూ. 200కు పెంచారు. గ్రామంలో ఏదో పది, ఇరవై మందికి మాత్రమే పింఛన్ అందేది. పింఛన్‌దారు మరణిస్తే తప్ప ఆ తరువాతి వారికి పింఛన్ అందించే దుస్థితి నుంచి బయటకు తీసుకువచ్చారు.

అర్హులందరినీ పింఛన్ల జాబితాలో చేర్చాలి..

ఇప్పుడు చంద్రబాబు మళ్లీ పాత పద్ధతులకు పదును పెట్టి రకరకాల ఆంక్షలతో ఇంటికి ఒక్క టే పింఛన్ అంటున్నారు. గ్రామానికి ఇన్ని పింఛన్లు అనే విధంగా రేషనింగ్ పెట్టే వ్యవహారాన్ని, కొందరికే పింఛన్లు అందించే కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఆధార్‌కార్డును ఉపయోగించి రేషన్ ఇవ్వకుండా ఆపుతారా.. ఖబడ్దార్ అన్న చంద్రబాబు ఇప్పుడు ఈ పింఛన్లకూ ఆధార్ ప్రాతిపదికగా ఆంక్షలు పెడుతూ అర్హుల పొట్టగొట్టేందుకు కత్తి దూస్తున్నారు. ఈ అమానుషమైన తొలగింపు కార్యక్రమంలో ప్రభుత్వానికి సహకరించవద్దని, అర్హులైన అందరినీ పింఛన్ల జాబితాలో చేర్చటానికి సహకరించాలని సర్పంచులకు, మండల అధ్యక్షులకు, మున్సిపల్ చైర్మన్లకు, వార్డ్ మెంబర్లకు, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్లకు.. కార్పొరేటర్లకు, వీరి నేతృత్వం లోని కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను.  

 - వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు’    
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement