an open letter
-
సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత తీవ్ర కలవరం పుట్టిస్తోంది. ముఖ్యంగా ట్విటర్, మెటా, గూగుల్ తదితర దిగ్గజ కంపెనీలు కూడా భారీగా లేఆఫ్స్ ప్రకటించడం ప్రస్తుత సంకక్షోభం పరిస్థితికి అద్దుపడుతోంది. ఈ ఆర్థిక సంక్షోభం ఉద్యోగాల తీసివేత నేపథ్యంలో గూగుల్ ఉ ద్యోగులు సీఈవోకు సుందర్ పిచాయ్‌కి బహిర లేఖ లేశారు. కొన్ని కీలక డిమాండ్లతో రాసిన ఈ లెటర్ హాట్ టాపిక్‌గా నిలిచింది. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్.లో దాదాపు 1,400 మంది ఉద్యోగులు ఈ బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేలా లేఆఫ్ ప్రక్రియలో మెరుగైన విధానాల్ని పాటించాల కోరుతూ పిటిషన్‌పై వీరంతా సంతకం చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డిమాండ్లను చేయడం గమనార్హం. అయితే ఈ లేఖపై ఆల్ఫాబెట్ ప్రతినిధి ఇంకా స్పందించలేదు. గూగుల్ సీఈవోకు ఉద్యోగులకు రాసిన లేఖలో ముఖ్యంగా కొత్త నియామకాలను స్తంభింప జేయడం, తొలగింపులకు ముందు స్వచ్ఛంద తొలగింపులను కోరడం, ఉద్యోగ ఖాళీల భర్తీకి తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మెటర్నిటీ, బేబీ బాండింగ్ వంటి సెలవుల్లో ఉన్న వారిని అర్థాంతరంగా తొలగించకుండా, వారి షెడ్యూల్డ్ సెలవులను పూర్తి చేయడానికి అనుమతించడం వంటి అనేక డిమాండ్లను ఇందులో ఉద్యోగులు చేశారు. దీనికి తోడు ఉక్రెయిన్, రష్యా వంటి యుద్ధ సంక్షోభ ప్రాంతాలకు చెందిన తోటి ఉద్యోగులను తొలగించవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. అలా చేయటంతో అక్కడి ఉద్యోగులు వీసా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సంక్షోభ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు అదనపు సహాయాన్ని కంపెనీ అందించా లన్నారు. లింగ, జాతి, కుల, వయస్సు, మతం, వైకల్యాలు లాంటి వివక్షలు లేకుండా ఉద్యోగుల పట్ల వ్యవహరించాలని ఉద్యోగులు తమ లేఖలో సుందర్ పిచాయ్ ని కోరారు. కంపెనీ 12వేల ఉద్యోగాలను తీసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖ చర్చకు దారి తీసింది. -
రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేయండి..!
భువనేశ్వర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఒడిశాకు చెందిన ఒకవ్యక్తి రాసిన బహిరంగ లేఖ కలకలం రేపుతోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ఎకానమీ తదితర అంశాలను ప్రస్తావిస్తూ సంజయ్ కుమార్ పట్నాయక్ ఈ లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన విమర్శలు గుప్పించారు.అవినీతిని అంతంచేయడానికి పెద్దనోట్లను రద్దు చేస్తే.. రద్దైన వెయ్యి రూపాయల నోట్ల కంటే రూ.2వేల నోట్ల వల్లే ఎక్కువ ప్రమాదం ఉందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించాల్సిన అవసరం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో , పెద్ద నగరాల్లోని ప్రజలకు వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగలరు. వారికి కరెన్సీ అవసరం. కానీ చిన్న పట్టణాల్లో లేదా గ్రామాలలోని నిరక్షరాస్యులైన ప్రజలకు కరెన్సీ మాత్రం అవసరమవుతుంది. దయచేసి రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపివేయండి. రాబోయే రెండు సంవత్సరాల్లో పెద్ద కరెన్సీల ఉపసంహరణకు ప్లాన్ చేయమని కోరుతున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. భారతదేశ పేద పౌరుల ఆర్థిక పరిస్థితుల గురించి మీకు తెలియదా? దేశంలో ప్రతి ఒక్కరూ మినిమం బ్యాలెన్స్ కొనసాగించేంత ధనికమైందా భారతదేశం? మినిమం బ్యాలెన్స్ నిర్ణయంపై నేను చాలా ఆశ్చర్యపోతున్నాను? దీనిపై విచారణ జరగాలని కోరుకుంటున్నాను. కనీసం జాతీయీకరించిన బ్యాంకుల్లోనైనా జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉండాలని మీరు భావించడంలేదా? లాంటి ప్రశ్నలను సంజయ్ కుమార్ సంధించారు. పబ్లిక్ / కంపెనీలు / పరిశ్రమలకు ఇచ్చే రుణాలు చాలా అరుదుగా బ్యాంకులు రికవరీ చేస్తాయి. కానీ పేదల రుణాలను రాబట్టడంలో మాత్రం ఎందుకు ధైర్యం చేస్తాయని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. మోదీజీ మీరు మీ స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం, ఇతర పార్టీలపై ఆధిపత్యంకోసం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే ఈ మెయిల్ మిమ్మల్ని లేదా బీజీపీకి బాధించదు కనుక లేఖను రద్దు చేయండి. ఇప్పటికీ దేశాన్ని మార్చడానికి చాలా అవకాశం ఉంది. నా లేఖను పరిగణనలోకి తీసుకుని స్పందిస్తారని ఎదురు చూస్తున్నాను. సంబంధిత చర్య తీసుకుంటారని భావిస్తున్నానంటూ ఆయన లేఖను ముగించారు. -
పెన్షన్లకు కత్తెర అమానుషం
పేదల పొట్టకొట్టే చంద్రబాబు సర్కారు కుట్రలో భాగస్వాములు కావద్దు పెన్షన్ల పరిశీలన కమిటీలకు ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్: అర్హులైన వారి ఫించన్లను కత్తిరించేందుకు..పేదల పొట్టగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కత్తిదూయ టం అమానుషం, దుర్మార్గమని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రకరకాల ఆంక్షలు పెడుతూ అర్హులైన వారి పింఛన్లను తొలగించేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న కుట్రలో భాగస్వాములు కావద్దని.. పింఛన్ల పరిశీలన కోసం నియమించిన కమిటీల అధ్యక్షులు, సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి కుల , మత, వర్గాలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులందరికీ పింఛన్లు లభించేలా చూడాలని, పేదల పక్షాన నిలబడాలని వారిని కోరుతూ జగన్ మంగళవారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది... ‘పెన్షన్లకు కత్తెర అమానుషం. ప్రభుత్వ ఎజెండా దుర్మార్గం. పార్టీలకు అతీతంగా పేదల పక్షాన నిలబడండి.. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పింఛన్లను ఏరి వేయడానికి ప్రభుత్వం తరఫున జరుగుతున్న కుట్రలో భాగస్వాములు కావద్దని పెన్షన్ల పరి శీలన కమిటీ అధ్యక్షులకు, సభ్యులకు ప్రతిపక్ష నాయకుడిగా, మహానేత తనయుడిగా, పేదల పక్షపాతిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు గ్రామగ్రామానా తిరుగుతూ రెండు వందల రూపాయల పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేస్తానని, రూ.500 పింఛన్‌ను 1,250 నుంచి రూ.1,500 చేస్తానని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా పింఛన్‌దార్ల మీద కక్షగట్టినట్లు, పగబట్టినట్లు ప్రవర్తిస్తూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేతన్నలూ, గీతన్నల పింఛన్లను కత్తిరించే కార్యక్రమం ప్రారంభించింది. నిన్నటి వరకూ పింఛన్లు అందుకున్న వృద్ధు లు, వికలాంగులు, వితంతువులు, నేతన్నలు, గీతన్నలు.. పింఛన్లు తొలగిస్తే ఇక వారంతా ఎలా బతుకుతారన్న ఆలోచన లేకుండా చంద్రబాబు ఖర్చు తగ్గించుకునే కార్యక్రమం ప్రాంభించారు. ఏపీలో 43,11,688 పింఛన్ల కోసం ఈ ఏడాది కేటాయింపు కనీసంగా 3,730 కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా చంద్రబాబు బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.1,338 కోట్లు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం 43,11,688 మంది పింఛన్లు తీసుకుంటున్నారు. అందులో... ► వృద్ధాప్య పింఛన్లు: 20,30,131 (వీరికి ప్రస్తు తం నెలకు రూ.200 ఇస్తుండగా అక్టోబర్ 2వ తేదీ నుంచి రూ.1,000 ఇవ్వాలి). ► వితంతు పింఛన్లు: 13,21,986 (వీరికి కూడా ప్రస్తుతం నెలకు రూ.200 ఇస్తుండగా అక్టోబర్ 2 నుంచి రూ.1,000 ఇవ్వాలి). ► వికలాంగుల పింఛన్లు: 5,36,837 (ప్రస్తుతం రూ.500 ఇస్తుండగా అక్టోబర్ 2 నుంచి రూ.1,500 ఇవ్వాలి). ► అభయహస్తం పింఛన్లు: 2,87,897 (ప్రస్తు తం రూ.500 ఇస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి వీరికి రూ.1,000 ఇవ్వాలి). ► ఇతర కేటగిరీ: దాదాపు 90 వేలు (వీటికి కూడా ప్రస్తుతం రూ.200 ఇస్తుంటే అక్టోబర్ 2 నుంచి రూ.1,000 ఇవ్వాల్సి ఉంటుంది). ► ఈ మొత్తం 42,11,688 మంది పింఛనుదారులకు ఇప్పటి వరకు నెలకు చెల్లిస్తున్న మొత్తం: రూ. 130 కోట్లు (అంటే - ఏప్రిల్ నుంచి ఆగ స్టు వరకు రూ.650 కోట్లు చెల్లించాలి.) ► సెప్టెంబర్ నుంచి (చంద్రబాబు చేసిన వాగ్దా నం మేరకు) 43,11,688 మంది పింఛనుదారులకు నెలకు రూ. 431 కోట్లు చెల్లించాలి. వీరిలో వికలాంగులకు పింఛన్ల కింద నెలకు రూ. 1,500 ఇవ్వాలి. ► ఈ లెక్కన మిగిలిన ఏడు నెలల్లో (ఏప్రిల్ వరకూ): నెలకు రూ. 440 కోట్లు చొప్పున 7 నెల లకు మొత్తం రూ. 3,080 కోట్లు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో సామాజిక పింఛన్లకు కేటాయించాల్సిన మొత్తం రూ.650 కోట్లు ప్లస్ రూ. 3,080 కోట్లు.మొత్తం 3,730 కోట్లు. ► కానీ బడ్జెట్లో కేటాయించింది: రూ 1,338 కోట్లు మాత్రమే. ► లోటు (తేడా): 2,400 కోట్ల రూపాయలు. ► అంటే ఈ రూ. 2,400 కోట్ల మేరకు సామాజిక పింఛన్లు క త్తిరించి, కొందరికి మాత్రమే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారని ఎవరికైనా అర్థం అవుతుం ది. అందుకే పేదలకు అన్యాయం చేసే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఎజెండాకు సహకరించకుండా అర్హులందరికీ పార్టీలకు, ప్రాం తాలకు, కుల మతాలకు అతీతంగా పింఛన్లు అందించేలా గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఉన్న నాయకులు, కమిటీ సభ్యులంతా మానవతా దృక్పథంతో ప్రవర్తిం చాలని.. ఈ కత్తెర కార్యక్రమానికి సహకరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మహానేత సాచ్యురేషన్ విధానాన్ని అవలంభించారు... మహానేత వైఎస్సార్ మరణం తరువాత, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో 7 లక్షల సామాజిక పింఛన్లకు పరిశీలనల పేరిట కోత పెట్టింది. నిజానికి మరో 15 లక్షల మంది సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. అర్హులందరికీ పింఛన్ అందించటానికి వీలుగా మహానేత సాచ్యురేషన్ (సంతృప్త స్థాయి) విధానాన్ని అవలంభించారు. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు వంటివి పరిగణనలోకి తీసుకోకుండా, అవసరం - అర్హత అనే ప్రాతిపదికలపై అందరికీ పింఛన్లు అందించారు. కాబట్టే వైఎస్సా ర్ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు 17 లక్షలు మాత్రమే ఉన్న పింఛన్లకు అదనంగా 55 లక్షల కొత్త పింఛన్లు అందించారు. పింఛన్ మొత్తాన్ని రూ.75 నుంచి రూ. 200కు పెంచారు. గ్రామంలో ఏదో పది, ఇరవై మందికి మాత్రమే పింఛన్ అందేది. పింఛన్‌దారు మరణిస్తే తప్ప ఆ తరువాతి వారికి పింఛన్ అందించే దుస్థితి నుంచి బయటకు తీసుకువచ్చారు. అర్హులందరినీ పింఛన్ల జాబితాలో చేర్చాలి.. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ పాత పద్ధతులకు పదును పెట్టి రకరకాల ఆంక్షలతో ఇంటికి ఒక్క టే పింఛన్ అంటున్నారు. గ్రామానికి ఇన్ని పింఛన్లు అనే విధంగా రేషనింగ్ పెట్టే వ్యవహారాన్ని, కొందరికే పింఛన్లు అందించే కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఆధార్‌కార్డును ఉపయోగించి రేషన్ ఇవ్వకుండా ఆపుతారా.. ఖబడ్దార్ అన్న చంద్రబాబు ఇప్పుడు ఈ పింఛన్లకూ ఆధార్ ప్రాతిపదికగా ఆంక్షలు పెడుతూ అర్హుల పొట్టగొట్టేందుకు కత్తి దూస్తున్నారు. ఈ అమానుషమైన తొలగింపు కార్యక్రమంలో ప్రభుత్వానికి సహకరించవద్దని, అర్హులైన అందరినీ పింఛన్ల జాబితాలో చేర్చటానికి సహకరించాలని సర్పంచులకు, మండల అధ్యక్షులకు, మున్సిపల్ చైర్మన్లకు, వార్డ్ మెంబర్లకు, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్లకు.. కార్పొరేటర్లకు, వీరి నేతృత్వం లోని కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. - వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు’ -
ప్రజలు భయంతో బతికే పరిస్థితి రానివ్వకండి
తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రొ. హరగోపాల్ బహిరంగ లేఖ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, మీకు బెంగళూరు నుండి ఫ్యాక్స్ ద్వారా ఒక విజ్ఞప్తి చేశాను. అది మీ దృష్టికి తప్పకుండా వచ్చి ఉంటుంది. ఏ విజ్ఞప్తులు చేసినా మీరు ఎవరి సలహా తీసుకున్నారో తెలియదు కాని, తెలంగాణ ప్రభుత్వం ఒక సభకు అనుమతించకపోవడమే కాక, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను, సభకు రావాలనుకుంటున్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పౌరహక్కుల సంఘం కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. (పౌరహక్కుల సంఘం తన సుదీర్ఘ చరిత్రలో మిమ్మల్ని తప్పించి ఏ రాజకీయ నాయకుడినీ పిలిచిన దాఖలాలు లేవు. మీరు ఒక ఉద్యమ పార్టీకి నాయకుడని, ఉద్యమ అనుభవాల దృష్ట్యా పౌరహక్కుల ఉల్లంఘనల మీద మీకు ఒక అనుభవముంటుందని హక్కుల సంఘం భావించింది. మీరు అప్పుడు మాట్లాడిన ప్రసంగం హక్కుల ఉద్యమానికి ఒక విశ్వాసం కల్పించింది.) అలాగే మీటింగ్ జరిగే స్థలంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి రాజ్యాంగం ద్వారా లభించిన ‘మీటింగ్ హక్కు’ను గౌరవించకపోవడం మా లాంటి వాళ్లను చాలా ఆశ్చర్యపరచింది. ఈ మీటింగ్ మావోయిస్టుల మీటింగ్ అని, మావోయిస్టు నాయకులు మీటింగ్‌కు వస్తున్నారని, తెలంగాణలో మళ్లీ మావోయిస్టు ప్రభావం ప్రబలుతుందని, పారిశ్రామికవేత్తలు ఇక రారని తప్పక మీకు సలహా ఇచ్చి ఉంటారు. అలాగే ముఖ్యమంత్రిగా మీరు చాలా దృఢ నిశ్చయంతో ముందుకు పోవాలని చాలా బలంగానే చెప్పి ఉంటారు. కానీ వాస్తవాలు అలా ఉండవు. మావోయిస్టు పార్టీ ప్రభావం, ఆ రాజకీయాల ఎదుగుదలకు సమాజంలో ఉండే సమస్యలు, రాజ్య అణచివేత ప్రధాన కారణాలు. ఒక స్వేచ్ఛ కలిగిన సమాజంలో అన్ని రాజకీయ అభిప్రాయాలూ వ్యక్తీకరించే ఒక ప్రజాస్వామ్య సంస్కృతి కావాలి. నిజానికి మావోయిస్టు పార్టీ చర్చలకు వచ్చినప్పుడు తుపాకులు లేకుండా తమ రాజకీయ అభిప్రాయాలను చెప్పుకునే స్వేచ్ఛ కావాలని అడిగారు. స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉంటే అలాగే అణచివేత లేకపోతే తమకు తుపాకులను ఉపయోగించే అవసరమే ఉండదని, తాము ఆత్మ రక్షణ కోసం తప్ప ఆయుధాలను ఉపయోగించమని స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పారు. ఆ చారిత్రక అవకాశాన్ని అప్పటి ప్రభుత్వం కావాలనే నీరు గార్చింది. పౌర స్పందన వేదికలో మీ గౌరవం, మీ పార్టీ గౌరవం పొందిన జయశంకర్ గారు కూడా సభ్యుడు. శాంతి చర్చలు విఫలమవుతున్న సందర్భంలో ‘డాక్టర్ సాబ్, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తప్ప వేరే గత్యంతరం లేద’ని ఆయన నాతో అన్నాడు. ఇవ్వాళ జయశంకర్ గారు బతికుంటే ఏం చేసేవాడో తెలియదు. తెలంగాణ ఏర్పడినా మనకు ఒక ప్రజాస్వామ్య తెలంగాణ విజన్ ఉండాలి కదా అంటే తెలంగాణ రానివ్వండి డాక్టర్ సాబ్, మనమే ఉంటాం కద అనేవాడు. తెలంగాణ వస్తే మన హోంమినిస్టర్ ఉంటాడు, ఇప్పుడు తెలంగాణ వాళ్లకు హోంమినిస్టర్ పదవి నామమాత్రంగా ఇచ్చి అధికారాన్ని ఆంధ్ర ప్రాంతం వాళ్లు చలాయిస్తున్నారు అంటూ తెలంగాణలో పరిస్థితి అలా ఉండదు కదా అనేవాడు. చంద్రశేఖర్‌రావు గారూ... ఏ కారణమేదైనా మీటింగ్‌ను జరగనివ్వకపోవడమే కాక హైద్రాబాదులో, జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలను అదుపులోకి తీసుకొనడం ద్వారా పోలీస్ యంత్రాంగానికి చాలా అధికారాలు ఇవ్వడమవుతుంది. ఇక వాళ్లు ప్రజలను వేధించడం ప్రారంభిస్తే ఆపైన మీ చేతిలో కూడా ఏమీ ఉండదు. ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుభవించిన వేధింపులు, అసహజ హత్యలు మీకు తెలియనివి కావు. మొత్తం అణచివేత నుండి తెలంగాణ బయటపడిందని ఊపిరి తీసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనడం తెలంగాణ ప్రజలను నిర్ఘాంతపరచింది. చుక్కా రామయ్య గారు, పొత్తూరు వెంకటేశ్వర్రావు గారు, నేను మీతో కలవడానికి ప్రయత్నం చేశాం. నిజానికి మీతో కలిసి పరిస్థితిని, రాబోయే పరిణామాలను మీకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉందని భావించాం. ఉదయం వరవరరావు గారిని అదుపులోకి తీసుకున్నారని పొత్తూరు వెంకటేశ్వర్రావు గారితో చెప్తే ‘ఇక నేను ఎక్కువ కాలం బ్రతకడం లాభం లేద’ని ఆయన అంటే నేను చలించిపోయాను. ఆ మనిషి ఆ వయసులో అంత బాధపడ్డాడంటే, తెలంగాణను తెలంగాణ ప్రజలను ఎంత ప్రేమించారో మీరు ఊహించవచ్చు. పొత్తూరు గారు తెలంగాణ గ్రామాలను తిరిగాడు, వాళ్లు అనుభవించిన హింసను కళ్లారా చూశాడు, అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారని భావించి, గుంటూరుకు చెందిన వాడైనా తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డాడు. గత మూడు నెలలుగా దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతి గురించి ప్రసంగించాను. మీ గురించి కూడా వివరించాను. ఉద్యమ నాయకుడు కాబట్టి మిగతా ముఖ్యమంత్రుల లాగా ఉండరని విశ్లేషించాను. మీరు ఒక తొందర నిర్ణయం వలన మా లాంటి వాళ్లను చాలా ఇబ్బందికి గురిచేశారు. తెలంగాణ వ్యతిరేకులు చాలా సంతోషంగా ఉన్నారు. ఉంటారు కూడా. నాకు అర్థం కాని అంశం, మీరు నిర్ణయం తీసుకునే ముందు కొందరు పెద్దలనైనా సంప్రదించవలసింది. వరవరరావు లాంటి వాళ్లతో మీరు డెరైక్ట్‌గా మాట్లాడవలసింది. వరవరరావు గారిని గతంలో మీరు ఒక కేంద్ర మంత్రిగా వెళ్లి కలసినప్పుడు, ఇప్పుడు ఆయనతో మాట్లాడడంలో మీకు ఇబ్బంది ఉండకూడదు. సార్, తెలంగాణ వాడిగా, పౌరహక్కుల కార్యకర్తగా, ఒక రాజనీతిశాస్త్ర బోధకుడుగా మీకు ఒక సలహా. అడగని సలహాలకు అంత గౌరవం ఉండదు. ఐనా చెప్పవలసిన బాధ్యత నాది. నేను ఎన్టీఆర్ దగ్గర నుండి కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా ప్రతి ముఖ్యమంత్రికి నా అభిప్రాయాలను చాలా సూటిగా, నిజాయితీగా చెప్పాను. అణచివేత పెరిగిన చోట హింస పెరుగుతుంది, స్వేచ్ఛా సమాజాలలో శాంతి విలసిల్లుతుంది. మీరు తీసుకున్న మొదటి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి. భవిష్యత్తులో తెలంగాణ పల్లెలలో ఏ పరిస్థితిలోనూ ప్రజలను వేధించవద్దని పోలీసు యంత్రాంగానికి కచ్చితమైన ఆజ్ఞలు ఇవ్వండి. అలాగే ఎలాంటి సభలకైనా అవి మావోయిస్టు సభలైనా అనుమతి నిరాకరించకండి. లేకపోతే తెలంగాణ ప్రజలు మీ పాలనను హర్షించరని దయచేసి అర్థం చేసుకోండి. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం మీకు సలహాలిచ్చినపుడు, మీ క్యాబినెట్ మంత్రులతో, మీ పార్టీ ప్రతినిధులతో చర్చించండి. నిర్ణయాలు తీసుకుని మొత్తం బాధ్యత మీ మీదే వేసుకోవడం మీకే మంచిది కాదు. తెలంగాణ ప్రజలను మరికొంత కాలం కంటి నిండా నిద్రపోనీయండి. ప్రజలకు మనం ఏమీ ఇవ్వలేకపోయినా, భయంతో బతికే పరిస్థితి రానివ్వకండి అని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రొ. జి. హరగోపాల్ ఒక తెలంగాణ స్వాప్నికుడు