ప్రజలు భయంతో బతికే పరిస్థితి రానివ్వకండి
తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రొ. హరగోపాల్ బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి గారికి,
మీకు బెంగళూరు నుండి ఫ్యాక్స్ ద్వారా ఒక విజ్ఞప్తి చేశాను. అది మీ దృష్టికి తప్పకుండా వచ్చి ఉంటుంది. ఏ విజ్ఞప్తులు చేసినా మీరు ఎవరి సలహా తీసుకున్నారో తెలియదు కాని, తెలంగాణ ప్రభుత్వం ఒక సభకు అనుమతించకపోవడమే కాక, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను, సభకు రావాలనుకుంటున్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పౌరహక్కుల సంఘం కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. (పౌరహక్కుల సంఘం తన సుదీర్ఘ చరిత్రలో మిమ్మల్ని తప్పించి ఏ రాజకీయ నాయకుడినీ పిలిచిన దాఖలాలు లేవు. మీరు ఒక ఉద్యమ పార్టీకి నాయకుడని, ఉద్యమ అనుభవాల దృష్ట్యా పౌరహక్కుల ఉల్లంఘనల మీద మీకు ఒక అనుభవముంటుందని హక్కుల సంఘం భావించింది. మీరు అప్పుడు మాట్లాడిన ప్రసంగం హక్కుల ఉద్యమానికి ఒక విశ్వాసం కల్పించింది.) అలాగే మీటింగ్ జరిగే స్థలంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి రాజ్యాంగం ద్వారా లభించిన ‘మీటింగ్ హక్కు’ను గౌరవించకపోవడం మా లాంటి వాళ్లను చాలా ఆశ్చర్యపరచింది.
ఈ మీటింగ్ మావోయిస్టుల మీటింగ్ అని, మావోయిస్టు నాయకులు మీటింగ్‌కు వస్తున్నారని, తెలంగాణలో మళ్లీ మావోయిస్టు ప్రభావం ప్రబలుతుందని, పారిశ్రామికవేత్తలు ఇక రారని తప్పక మీకు సలహా ఇచ్చి ఉంటారు. అలాగే ముఖ్యమంత్రిగా మీరు చాలా దృఢ నిశ్చయంతో ముందుకు పోవాలని చాలా బలంగానే చెప్పి ఉంటారు. కానీ వాస్తవాలు అలా ఉండవు. మావోయిస్టు పార్టీ ప్రభావం, ఆ రాజకీయాల ఎదుగుదలకు సమాజంలో ఉండే సమస్యలు, రాజ్య అణచివేత ప్రధాన కారణాలు. ఒక స్వేచ్ఛ కలిగిన సమాజంలో అన్ని రాజకీయ అభిప్రాయాలూ వ్యక్తీకరించే ఒక ప్రజాస్వామ్య సంస్కృతి కావాలి. నిజానికి మావోయిస్టు పార్టీ చర్చలకు వచ్చినప్పుడు తుపాకులు లేకుండా తమ రాజకీయ అభిప్రాయాలను చెప్పుకునే స్వేచ్ఛ కావాలని అడిగారు. స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉంటే అలాగే అణచివేత లేకపోతే తమకు తుపాకులను ఉపయోగించే అవసరమే ఉండదని, తాము ఆత్మ రక్షణ కోసం తప్ప ఆయుధాలను ఉపయోగించమని స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పారు. ఆ చారిత్రక అవకాశాన్ని అప్పటి ప్రభుత్వం కావాలనే నీరు గార్చింది.
పౌర స్పందన వేదికలో మీ గౌరవం, మీ పార్టీ గౌరవం పొందిన జయశంకర్ గారు కూడా సభ్యుడు. శాంతి చర్చలు విఫలమవుతున్న సందర్భంలో ‘డాక్టర్ సాబ్, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తప్ప వేరే గత్యంతరం లేద’ని ఆయన నాతో అన్నాడు. ఇవ్వాళ జయశంకర్ గారు బతికుంటే ఏం చేసేవాడో తెలియదు. తెలంగాణ ఏర్పడినా మనకు ఒక ప్రజాస్వామ్య తెలంగాణ విజన్ ఉండాలి కదా అంటే తెలంగాణ రానివ్వండి డాక్టర్ సాబ్, మనమే ఉంటాం కద అనేవాడు. తెలంగాణ వస్తే మన హోంమినిస్టర్ ఉంటాడు, ఇప్పుడు తెలంగాణ వాళ్లకు హోంమినిస్టర్ పదవి నామమాత్రంగా ఇచ్చి అధికారాన్ని ఆంధ్ర ప్రాంతం వాళ్లు చలాయిస్తున్నారు అంటూ తెలంగాణలో పరిస్థితి అలా ఉండదు కదా అనేవాడు.
చంద్రశేఖర్‌రావు గారూ... ఏ కారణమేదైనా మీటింగ్‌ను జరగనివ్వకపోవడమే కాక హైద్రాబాదులో, జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలను అదుపులోకి తీసుకొనడం ద్వారా పోలీస్ యంత్రాంగానికి చాలా అధికారాలు ఇవ్వడమవుతుంది. ఇక వాళ్లు ప్రజలను వేధించడం ప్రారంభిస్తే ఆపైన మీ చేతిలో కూడా ఏమీ ఉండదు. ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుభవించిన వేధింపులు, అసహజ హత్యలు మీకు తెలియనివి కావు. మొత్తం అణచివేత నుండి తెలంగాణ బయటపడిందని ఊపిరి తీసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనడం తెలంగాణ ప్రజలను నిర్ఘాంతపరచింది.
చుక్కా రామయ్య గారు, పొత్తూరు వెంకటేశ్వర్‌రావు గారు, నేను మీతో కలవడానికి ప్రయత్నం చేశాం. నిజానికి మీతో కలిసి పరిస్థితిని, రాబోయే పరిణామాలను మీకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉందని భావించాం. ఉదయం వరవరరావు గారిని అదుపులోకి తీసుకున్నారని పొత్తూరు వెంకటేశ్వర్‌రావు గారితో చెప్తే ‘ఇక నేను ఎక్కువ కాలం బ్రతకడం లాభం లేద’ని ఆయన అంటే నేను చలించిపోయాను. ఆ మనిషి ఆ వయసులో అంత బాధపడ్డాడంటే, తెలంగాణను తెలంగాణ ప్రజలను ఎంత ప్రేమించారో మీరు ఊహించవచ్చు. పొత్తూరు గారు తెలంగాణ గ్రామాలను తిరిగాడు, వాళ్లు అనుభవించిన హింసను కళ్లారా చూశాడు, అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారని భావించి, గుంటూరుకు చెందిన వాడైనా తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డాడు.
గత మూడు నెలలుగా దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతి గురించి ప్రసంగించాను. మీ గురించి కూడా వివరించాను. ఉద్యమ నాయకుడు కాబట్టి మిగతా ముఖ్యమంత్రుల లాగా ఉండరని విశ్లేషించాను. మీరు ఒక తొందర నిర్ణయం వలన మా లాంటి వాళ్లను చాలా ఇబ్బందికి గురిచేశారు. తెలంగాణ వ్యతిరేకులు చాలా సంతోషంగా ఉన్నారు. ఉంటారు కూడా. నాకు అర్థం కాని అంశం, మీరు నిర్ణయం తీసుకునే ముందు కొందరు పెద్దలనైనా సంప్రదించవలసింది. వరవరరావు లాంటి వాళ్లతో మీరు డెరైక్ట్‌గా మాట్లాడవలసింది. వరవరరావు గారిని గతంలో మీరు ఒక కేంద్ర మంత్రిగా వెళ్లి కలసినప్పుడు, ఇప్పుడు ఆయనతో మాట్లాడడంలో మీకు ఇబ్బంది ఉండకూడదు.
సార్, తెలంగాణ వాడిగా, పౌరహక్కుల కార్యకర్తగా, ఒక రాజనీతిశాస్త్ర బోధకుడుగా మీకు ఒక సలహా. అడగని సలహాలకు అంత గౌరవం ఉండదు. ఐనా చెప్పవలసిన బాధ్యత నాది. నేను ఎన్‌టీఆర్ దగ్గర నుండి కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా ప్రతి ముఖ్యమంత్రికి నా అభిప్రాయాలను చాలా సూటిగా, నిజాయితీగా చెప్పాను. అణచివేత పెరిగిన చోట హింస పెరుగుతుంది, స్వేచ్ఛా సమాజాలలో శాంతి విలసిల్లుతుంది. మీరు తీసుకున్న మొదటి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి. భవిష్యత్తులో తెలంగాణ పల్లెలలో ఏ పరిస్థితిలోనూ ప్రజలను వేధించవద్దని పోలీసు యంత్రాంగానికి కచ్చితమైన ఆజ్ఞలు ఇవ్వండి. అలాగే ఎలాంటి సభలకైనా అవి మావోయిస్టు సభలైనా అనుమతి నిరాకరించకండి. లేకపోతే తెలంగాణ ప్రజలు మీ పాలనను హర్షించరని దయచేసి అర్థం చేసుకోండి. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం మీకు సలహాలిచ్చినపుడు, మీ క్యాబినెట్ మంత్రులతో, మీ పార్టీ ప్రతినిధులతో చర్చించండి. నిర్ణయాలు తీసుకుని మొత్తం బాధ్యత మీ మీదే వేసుకోవడం మీకే మంచిది కాదు. తెలంగాణ ప్రజలను మరికొంత కాలం కంటి నిండా నిద్రపోనీయండి. ప్రజలకు మనం ఏమీ ఇవ్వలేకపోయినా, భయంతో బతికే పరిస్థితి రానివ్వకండి అని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రొ. జి. హరగోపాల్
ఒక తెలంగాణ స్వాప్నికుడు